
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సందర్బంగా విపక్షాల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్‌లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.
నేడు లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. విపక్షాల వల్లే ఈసారి సభ సరిగా జరగలేదని ఆయన అన్నారు. ఇక రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.
Lok Sabha adjourned sine die. #ParliamentMonsoonSession pic.twitter.com/pD9xrX7Xag
— Press Trust of India (@PTI_News) August 21, 2025
ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోకసభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌పై అత్యధికంగా 37 గంటలపాటు జూలై 28, 29 తేదీల్లో ప్రత్యేక చర్చ నడిచింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైనా ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తికాలేదు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా, కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది.