Parliament Budget Session: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది | Sakshi
Sakshi News home page

Parliament Budget Session: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది

Published Thu, Feb 8 2024 5:35 AM

Parliament Budget Session: PM Narendra Modi attacks Congress over new divisive narrative - Sakshi

న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని, ఆ పార్టీకి వారంటీ లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూ రెండుగా విభజించానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ బుధవారం సమాధానమిచ్చారు. దాదాపు 90 నిమిషాలపాటు మాట్లాడారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్‌లో ఇదే ఆయన చివరి ప్రసంగం కావడం విశేషం. కేంద్రంలో తాము వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పునరుద్ఘాటించారు. ‘మోదీ 3.0 ప్రభుత్వ’ హయాంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్ల తమ విజన్‌ను ఆవిష్కరించారు. వికసిత భారత్‌ పునాదిని పటిష్టం చేస్తామని ప్రకటించారు. మోదీ 3.0 సర్కారు ఏర్పాటు ఇక ఎంతోదూరంలో లేదని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన కాంగ్రెస్‌  
‘‘దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్‌ ఎప్పటికీ వ్యతిరేకమే. బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ లేకపోతే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు దక్కేవే కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటే ప్రభుత్వ పరిపాలన దెబ్బతింటుందని నెహ్రూ చెప్పారు. ఓబీసీలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ పూర్తిస్థాయి రిజర్వేషన్లు ఇవ్వలేదు.

జనరల్‌ కేటగిరీలోని పేదలను కూడా పట్టించుకోలేదు. భారతరత్న పురస్కారానికి అంబేడ్కర్‌ అర్హుడని కాంగ్రెస్‌ భావించలేదు. సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డులు ఇచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు మాకు నీతిపాఠాలు బోధిస్తోంది. మన దేశ భూభాగాలను శత్రు దేశానికి అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత భద్రతపై మాకు ఉపన్యాసాలు ఇస్తోంది. ఆ పార్టీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని గొంతుకోసి చంపేసింది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూలదోసింది.

వికసిత భారత్‌.. మా అంకితభావం  
కాంగ్రెస్‌ పాలనలో దేశం సమస్యల వలయంలో చిక్కుకుంది. వాటి పరిష్కారానికే ప్రధానిగా నా రెండు టర్ములను వెచ్చించాను. వికసత భారత్‌ ఒక పదం కాదు. అది మా అంకితభావం. సబ్‌కా సాత్‌ అనేది నినాదం కాదు. అది మోదీ ఇస్తున్న గ్యారంటీ. వారంటీ తీరిపోయినవారు చెప్పే మాటలను దేశం వినిపించుకోదు. గ్యారంటీ బలాన్ని చూపించినవారినే దేశం విశ్వసిస్తుంది.  

అన్ని వర్గాల సంక్షేమానికి పదేళ్లుగా కృషి  
‘యువరాజు’ (రాహుల్‌)ను స్టార్టప్‌గా తయారు చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కానీ, ఆయనొక నాన్‌–స్టార్టర్‌. ఎంత లిఫ్ట్‌ చేయాలని చూసినా ఫలితం ఉండడం లేదు. కాంగ్రెస్‌ ఆలోచనావిధానానికి కాలం చెల్లింది. అందుకే ఆ పార్టీ పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. కాంగ్రెస్‌ నానాటికీ దిగజారిపోతుండడం మాకూ బాధగానే ఉంది. సొంత పార్టీ నేత పట్ల గ్యారంటీ లేని కాంగ్రెస్‌ మోదీ గ్యారంటీని ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం. పదేళ్ల యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగే దీన్ని అంగీకరించారు. దేశ సమస్యలేమిటో తెలిసినా వాటి పరిష్కారానికి కాంగ్రెస్‌ ఏనాడూ కృషి చేయలేదు. బ్రిటిష్‌ పాలన నుంచి స్ఫూర్తి పొంది బానిసత్వపు గుర్తులను దశాబ్దాల పాటు కొనసాగించింది. మేము అధికారంలోకి వచ్చాక సమస్యల సుడిగుండం నుంచి దేశాన్ని బయటపడేశాం.

మా గళానికి ప్రజలు బలమిచ్చారు  
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశమంతటా 40 సీట్లు కూడా రావన్న సవాలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. ఇప్పుడున్న 40 సీట్లను కాంగ్రెస్‌ మళ్లీ నిలబెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. విపక్షాల ప్రతి మాటను మేం చాలా సహనంతో వింటున్నాం. కానీ, మేము చెప్పేది ప్రతిపక్షాలు వినడం లేదు. మా గళాన్ని మీరు అణచివేయలేరు. దానికి దేశ ప్రజలు చాలా బలమిచ్చారు’’.

దయచేసి ఆ భాష మానుకోండి  
‘‘కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. భారత్‌ను ఉత్తర, దక్షిణంగా ముక్కలు చేయడానికి కొత్తకొత్త ప్రకటనలు చేస్తోంది. ఉత్తరం, దక్షిణం అనే విభజన రేఖ తీసుకురావడం కాంగ్రెస్, కర్ణాటక ప్రభుత్వం మానుకోవాలి. దేశ భవిష్యత్తుతో చెలగాటం వద్దు. ‘మా పన్నులు, మా డబ్బులు’ అంటూ మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి ఇలాంటి భాష బాధగా ఉంది. దయచేసి ఆ భాష మానుకోండి. దీనివల్ల దేశానికి నష్టం తప్ప లాభం ఉండదు. దేశమంటే కొన్ని భూభాగాల సమ్మేళనం కాదు. ఒక అంగం పనిచేయకపోతే శరీరమంతా స్తంభిస్తుంది. అలాగే దేశంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేస్తే దేశమంతా అభివృద్ధి చెందలేదు’’.

Advertisement
Advertisement