News Of TDP Joining NDA Has Further Damaged Party Image - Sakshi
Sakshi News home page

ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..

Published Thu, Jul 13 2023 9:12 AM

News Of Tdp Joining Nda Has Further Damaged Party Image - Sakshi

తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చాయి.. ఎంతగా పాకులాడవలసి వస్తోంది? అయినా పరువు పోతోందే. తాజాగా ఎన్డీయేలోకి టీడీపీ అంటూ వచ్చిన వార్తలు ఆ పార్టీ  ప్రతిష్టను మరింతగా దెబ్బతీశాయి. ఈ నెల పందొమ్మిదిన ఢిల్లీలో జరగబోయే నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్(ఎన్.డి.ఎ) సమావేశానికి తెలుగుదేశం పార్టీని కూడా ఆ ఆహ్వానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజంగా జాతీయ మీడియా ఊహాగానం చేసిందా? లేక తెలుగుదేశం వారెవరైనా ఇచ్చిన లీక్ ఆధారంగా కథనాలు ఇచ్చారో కాని, మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పపోతున్నారన్నంతగా ప్రచారం జరిగింది.

తెలుగుదేశం మీడియా కూడా పోటీపడి ప్రచారం చేస్తూ, ఎన్డీయేలో చేరడమా? వద్దా అన్న దానిపై టీడీపీ ఆలోచన చేస్తోందని ముక్తాయింపు ఇచ్చారు. తీరా చూస్తే అసలు టీడీపీని ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించనే లేదట. స్వయంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో టీడీపీ కుడితిలో పడినట్లయింది. 2017లో ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించడమే కాకుండా ఎన్డీయేకి దూరం అయినట్లు ప్రకటించారు. అక్కడితో  ఆగలేదు. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి హడావుడి చేశారు.

పశ్చిమ బెంగాల్ వెళ్లి ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సంఘీభావం ప్రకటించి వచ్చారు. తదనంతరం కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. రాహుల్ గాంధీని తానే చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తెలంగాణలో  కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పక్షాలతో కలిసి పోటీ చేసి దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి  ఒంటరిగా పోటీ చేసి అధికారం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి మోదీ వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయించారు.
చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!

మోదీ వల్ల దేశం నాశనం అవుతోందని అనేవారు. అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కాని 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. తన ఎంపీలను బీజేపీలోకి పంపించారు. మెల్లగా బీజేపీ పెద్దలను కాకా పట్టడం ఆరంభించారు. మోదీ గొప్ప నేత అని చెప్పసాగారు.  బీజేపీ వారు పట్టించుకోలేదు. అయినా పట్టు వదలకుండా, ఎలాగైతే అమిత్ షా అప్పాయింట్‌మెంట్ సంపాదించారు. ఈలోగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవుతున్నాయని తనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాలో పలుమార్లు ప్రచారం చేయించారు.

అమిత్ షాతో భేటీ అవడం మొత్తం మీద ఏదో జరుగుతోందేమోనన్న భావన కలిగింది. కాని ఆ భేటీ తర్వాత చంద్రబాబు నోరు విప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరచింది. అయినా టీడీపీ తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలపడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు వాస్తవ పరిస్థితిని గమనంలోకి తీసుకున్నారేమో తెలియదు కాని, ఏపీలో టీడీపీతో కలవడానికి భవిష్యత్తులో ఏమి చేస్తారో కాని, ప్రస్తుతానికి  సిద్దపడడం లేదు. అక్కడికి తెలంగాణలో ఉపయోగపడతామని కూడా కబురంపారు. కాని చంద్రబాబు ట్రాక్ రికార్డు చూసిన బీజేపీ ఆయనను నమ్మడం లేదు.

ఈ దశలో మళ్లీ ఎన్డీయే సమావేశానికి టీడీపీ, అకాలీదళ్, జెడిఎస్‌లను పిలిచారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ సోషల్ మీడియా ఎగిరి గంతేసినట్లుగా పోస్టులు పెట్టేసింది. తీరా చూస్తే అదంతా ఒట్టిదేనని తేలడంతో టీడీపీ ఉస్సూరుమంటూ కూర్చోవలసి వచ్చింది. ఒకపక్క ఆయా సర్వేలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభజనం ఏపీలో కొనసాగుతోందని వెల్లడవుతుండడంతో అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తోంది. కాని బీజేపీలో చేరిన టీడీపీ నేతలు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అది ఎప్పటికైనా ఫలించకపోతుందా అన్న ఆశ వారిలోలేకపోలేదు.

ఈలోగా జరగవలసిన డామేజీ జరిగిపోయింది. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో బీజేపీని వ్యతిరేకించే కొన్ని సామాజికవర్గాలలో టీడీపీపై నెగిటివ్ అభిప్రాయం మరింతగా పెరిగింది. విధం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా అటు  బీజేపీతో పొత్తు కుదరలేదు.. ఇటు ఆ పార్టీతో పొత్తు కోసం పాకులాడుతోందన్న భావనతో పరువు పోయింది. ఒకవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఒంటరిగా పోటీచేస్తామని సవాలు విసురుతుంటే, తాము అలా చేయలేమని, ఒంటరిగా అయితే ఓడించలేమని చంద్రబాబు  అంగీకరిస్తున్నట్లయింది.
చదవండి: భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

టీడీపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న జనసేన కూడా ఈ నేపథ్యంలో ఇంకో రకంగా ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా ముగిసిపోయిందని, భార్యతో విడాకులు తీసుకున్నారంటూ జరిగిన ప్రచారం ఆయనకు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టింది. దీనిపై జనసేన పరోక్షంగా ఖండన ఇస్తూ వారాహి రెండో దశ యాత్ర కోసం జరిగిన పూజలో పవన్ దంపతులు పాల్గొన్నారంటూ ఒక ట్వీట్ చేసింది.

కాని అది నకిలీ ఫోటో అంటూ కొన్ని యూ ట్యూబ్ చానళ్లు సోదాహరణంగా వివరించడంతో జనసేన మరింత గందరగోళంలో పడింది. దీనికి సంబంధించి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు జనసేన తెలిపి నష్ట నివారణ చర్యలకు తంటాలు పడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కావాలని ఒకసారి, తాను సీఎం పదవికి అర్హుడను కానని మరోసారి ప్రకటించి పరువు తీసుకున్న పవన్‌కు వ్యక్తిగత విషయం కూడా కాస్త ఇబ్బంది కలిగించేదే. ఇలా టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా తమ గాలి తామే తీసేసుకుంటూ రాజకీయంగా తీవ్రంగానే నష్టపోతున్నాయి.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement