బీఆర్‌ఎస్‌ కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం | Minister Uttam Kumar Reddy Fires On BRS Over Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం

Jun 8 2025 4:51 AM | Updated on Jun 8 2025 4:51 AM

Minister Uttam Kumar Reddy Fires On BRS Over Kaleshwaram Project

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అవాస్తవిక ప్రచారం చేపడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ ప్రచారానికి అంశాలవారీగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే 
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరే. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తవగా 2023–24 వరకు మొత్తంగా 162 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చావో చెప్పు?’అని హరీశ్‌రావును మంత్రి ఉత్తమ్‌ ఆ ప్రకటనలో నిలదీశారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్‌ నీటమునిగిందని.. అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ ట్రెస్ట్‌వాల్‌ కూలి పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు. 2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు. 

నిధుల మళ్లింపు కోసమే బీఆర్‌ఎస్‌ బ్యారేజీలు.. 
‘ఫరక్కా బ్యారేజీ కట్టింది నీటి మళ్లింపు కోసమే. రాతి పునాది వల్లే ఆ బ్యారేజీ మనుగడ సాగిస్తోంది. ఫరక్కా బ్యారేజీని 1975లో కట్టినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రతిపాదించింది.. కట్టింది.. బీఆర్‌ఎస్‌ హయాంలోనే. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్‌ఎస్‌ హయాంలోనే. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజీలను నిధుల మళ్లింపు కోసం కట్టారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యం’అని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. 

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా? ఆ తర్వాత బ్యారేజీ కట్టకుండా ఎందుకు పక్కనపెట్టారు? తుమ్మిడిహెట్టి వద్ద కడితే పేరు కాంగ్రెస్‌కు, పైసలు రావనేది ప్రధాన కారణం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కి.మీ. ఓపెన్‌ కెనాల్‌ నిర్మాణం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 100 కి.మీ. దాకా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవి. కానీ మేడిగడ్డ బ్యారేజీ వల్ల 100 కి.మీ. కిందకు వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం చేశారు. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకం’అని ఉత్తమ్‌ మండిపడ్డారు.

వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావే 
కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావేనని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దురి్వనియోగం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని... నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పేరు రావొద్దనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ రూ. 38 వేల కోట్లతో పూర్తై ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు.

కానీ బీఆర్‌ఎస్‌ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి శాశ్వత నష్టం జరిగిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ కమీషన్ల కక్కుర్తి వల్ల తెలంగాణ ప్రజలు నీటిపారుదల ప్రాజెక్టుల అప్పులకు ఏటా రూ. 16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అన్ని మోటార్లు పనిచేసి ఉంటే విద్యుత్‌ భారమే ఏడాదికి రూ. 10 వేల కోట్లు అయ్యేదన్న మంత్రి ఉత్తమ్‌.. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్‌ భారం కేవలం రూ.1000 కోట్లే అయ్యేదన్నారు. బీఆర్‌ఎస్‌ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణకు ఆర్థిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందని విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement