చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు

Minister Peddireddy Ramachandra Reddy Fires On TDP And BJP - Sakshi

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తమకు ఆయుధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్‌ తీవ్రత వల్లే ఈనెల 14న సీఎం వైఎస్‌ జగన్‌ సభ వాయిదా  వేసినట్లు పేర్కొన్నారు. ‘‘తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం. మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు.

బీజేపీకి ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదని.. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారంటూ మంత్రి ప్రశ్నించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్మూధైర్యం ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో పోరాడలేదని ఆయన మండిపడ్డారు.

‘‘రైతు సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సీఎం జగన్ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగుతోంది. రాయలసీమ కోసం వేలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే. వైఎస్సార్‌సీపీపై బీజేపీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని’’ మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు.

చదవండి:
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!
టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top