ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగమే | Minister Harish rao at Bhumi Puja of Sangameswara Ettipithala | Sakshi
Sakshi News home page

ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగమే

Jun 8 2023 2:43 AM | Updated on Jun 8 2023 2:43 AM

Minister Harish rao at Bhumi Puja of Sangameswara Ettipithala - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగం అవుతుందని, ఉద్యమనేత కేసీఆర్‌ చేతుల్లో ఉంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సాగునీరు, తాగునీరు వంటి సమస్యలకు కేసీఆర్‌ హయాంలోనే పరిష్కారం లభించిందని, దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.2,653 కోట్లతో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాకపోతే, కేసీఆర్‌ సీఎం కాకపోతే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగేదా? తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదా? అని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. సింగూరు ప్రాజెక్టు కోసం మెదక్‌ రైతులు భూములు కోల్పోతే నీళ్లు హైదరాబాద్‌కు వెళ్లాయన్నారు. సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకే దక్కాలని సీఎం కేసీఆర్‌ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో హైదరాబాద్‌ తాగునీటి కష్టాలు తీర్చారని వివరించారు.
 
రైతులతో ముచ్చట...: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో ముచ్చటించారు. ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్‌ చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

కాగా, మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి సిద్దిపేటలో రంగనాయసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది లేకుండా ఒక ప్రాజెక్ట్‌ ఉందంటే అది మానవ నిర్మితమైన మల్లన్నసాగర్‌ ఒక్కటే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఢిల్లీలో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ ఓపికగా తిరిగిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement