సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్ విసిరారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్‌కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.
కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


