
మంచిర్యాల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఎన్.దివాకరరావు నాలుగోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత ప్రేమ్ సాగరరావుపై 4877 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో మంచిర్యాల ఏర్పడకముందు రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు.
2014లో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి వరసగా మరో రెండుసార్లు గెలుపొందారు. దివాకరరావుకు 75070 ఓట్లు రాగా, ప్రేమ్ సాగరరావుకు 70193 ఓట్లు వచ్చాయి. ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసి ఎర్రబెల్లి రఘునాధరావుకు 4981 ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. మంచిర్యాలలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడుసార్లు టిఆర్‌ఎస్ పార్టీనే గెలిచింది.
భారీ తేడాతో పరాజయం..
మంచిర్యాల నియోజకవర్గంలో 2014 వరకు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ రెడ్డి టిఆర్‌ఎస్‌ను వదలి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్ ఐ నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎన్. దివాకరరావు విజయం సాధించారు. దివాకరరావు అంతకుముందు ఉన్న లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొంది, తిరిగి మరో రెండుసార్లు మంచిర్యాల నుంచి గెలిచారు. 2014లో దివాకరరావుకు 59,250 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. మంచిర్యాలలో రెడ్డి వర్గానికి చెందిన అరవిందరెడ్డి 2009 సాధారణ ఎన్నికలోను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలోను గెలుపొందారు.2014లో ఓటమిపాలయ్యారు.
గతంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఉండేది. అక్కడ ఒకరు చుంచు లక్ష్మయ్య (బిసి) తప్ప మిగిలినవారంతా వెలమ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. రెండుసార్లు గెలిచిన అరవింద్‌రెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత, జడ్.పి.చైర్మన్‌గా రెండుసార్లు, ఓసారి ఎమ్.పి.గా గెలిచిన జి.నరసింహారెడ్డి కుమారుడు. అంతకు ముందు పాత నియోజకవర్గం లక్సెట్టిపేటకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు, జనతాపార్టీ, సోషలిస్టు పార్టీ ఒక్కోసారి గెలవగా ఒక ఇండిపెండెంటు కూడా మరోసారి నెగ్గారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి జె.వి. నరసింగరావు ఇక్కడ 1967,72లలో గెలవగా అంతకుముందు 1962లో ఆయన బంధువు జి.వి.పితాంబరరావు చేతిలో ఓడిపోయారు. జె.వి. నరసింగరావు 1957లో బేగంబజార్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. రెండు సార్లు పీతాంబరరావు గెలిస్తే, ఆయన సోదరుడు జి.వి.సుధాకరరావు కూడా మరో రెండుసార్లు విజయం సాధించారు.
మరో దళిత నేత రాజమల్లు ఇక్కడ ఒకసారి, సిర్పూరులో మరోసారి, చిన్నూరులో మూడు సార్లు గెలిచారు. జె.వి. నర్సింగరావు గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో సభ్యునిగా ఉండగా, జి.వి.సుధాకరరావు 1978లో శాసనసమండలి సభ్యునిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాలలో, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. రాజమల్లు 1974లో జలగం క్యాబినెట్‌లో పనిచేసారు. జె.వి. నర్సింగరావు అప్పట్లో కాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మంచిర్యాలలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..