జన్నారం: కూలీ పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న దంపతుల కుమార్తెలు ఆర్మీలో ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చారు. పొన్కల్ గ్రామ పంచాయతీలోని గాంధీనగర్ కాలనీకి చెందిన బొమ్మిడి రాజేందర్, సుజాత దంపతులకు శ్రావ్యరాణి, ప్రవళిక ఇద్దరు కుమార్తెలు. రాజేందర్ హోటల్‌లో సుజాత దుకాణంలో కూలీలుగా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించారు. శ్రావ్యరాణి జన్నారంలో పదో తరగతి, నిర్మల్‌లో ఇంటర్, మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేయగా ప్రవళిక జన్నారంలోనే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 2024లో కేంద్రప్రభుత్వ నిర్వహించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో జవాన్లుగా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకుని బుధవారం స్వగ్రామానికి వచ్చారు. శ్రావ్యరాణికి ఢిల్లీ మెట్రోలో, ప్రవళికకు జమ్మూకశ్వీర్‌లో పోస్టింగ్ వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి హరితరిసార్ట్స్‌కు వచ్చిన అక్కాచెల్లెళ్లను మేనేజర్ వీరేందర్‌సింగ్ సన్మానించారు. ఇద్దరు కుమార్తెలకు ఉద్యోగం లభించడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


