నిర్మల్‌ఖిల్లా: ఆర్టీసీ బస్సు ప్రయాణం సుఖమయం..శుభప్రదం.. అంటూ సేవల్ని క్రమంగా విస్తరి స్తు న్న సంస్థ మరో ముందడుగు వేసింది. ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సి న అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారానే బుక్ చే సుకునే విధానాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ర వా ణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గత మంగళవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. బస్సు టికెట్లు, పాసులు లాంటి సేవలను ఆర్టీసీ డిజిటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చింది. ‘మీ టికెట్’ యాప్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలు నమోదు చేసి కావలసిన రూట్‌ను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లోనే చార్జీ చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
బుక్ చేసుకోవడం ఇలా..
స్మార్ట్ మొబైల్ ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆర్టీసీ సేవలను ఎంపిక చేసుకోవాలి. అనంతరం గమ్యస్థానాన్ని నమోదు చేసి అందుబాటులో ఉన్న బస్సును ఎంచుకుని చెల్లింపు పూర్తి చేస్తే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ–టికెట్ లభిస్తుంది. బస్సులో ఎక్కిన తర్వాత సిబ్బందికి ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భైంసా తదితర ప్రాంతాల నుంచి రోజూ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, తిరుపతి తదితర ప్రధాన నగరాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బస్ డిపోలు ఉండగా ప్రయాణికులు విద్య, వైద్యం తదితర పనుల నిమిత్తం హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు ప్రయాణిస్తుంటారు. ఈ కొత్త విధానంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రయాణికులు మరింత సులభంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలగనుంది. డిజిటల్ సేవల ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల నుంచి కూడా తగిన స్పందన వస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేస్తున్నారు.


