లక్ష్మణచాంద: అడవిజంతువు ల బారినుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసి న విద్యుత్ తీగలకు తగిలి రైతు మృతి చెందిన సంఘట న మండలంలో చోటు చేసుకుంది. నర్సాపూర్(డబ్ల్యూ) గ్రామానికి చెందిన కాయితి రవీందర్‌రెడ్డి (48) కనకాపూర్–నర్సాపూర్ గ్రామా ల మధ్య మొక్కజొన్న పంట సాగు చేశాడు. అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి బారినుంచి పంటలను కాపాడుకునేందుకు చేనుచుట్టూ విద్యుత్ తీగలు అమర్చాడు. రాత్రి సమయంలో కనెక్షన్ ఇచ్చి మళ్లీ ఉదయం నాలుగు గంటలకు ఎవరూ నిద్రలేవకముందే వెళ్లి కనెక్షన్ తొలగిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చేను వద్దకు వెళ్లిన రవీందర్‌రెడ్డి ఉల్లిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించే ప్రయత్నంలో వి ద్యుత్ కనెక్షన్ తొలగించడం మర్చిపోయి చేనులోకి దిగాడు. ఈక్రమంలో విద్యుత్ తీగలు కాళ్లకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆవు పాలు ఇవ్వడం లేదని...
రవీందర్‌రెడ్డి పెంచుతున్న ఆవు కేవలం అతనికి మాత్రమే పాలు ఇస్తుంది. పాలు పిండే సమయం దాటిపోతున్నా తండ్రి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని పెద్ద కుమారుడు బన్నీ చేనువద్దకు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రావణి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
పరీక్ష కేంద్రం నుంచి వెనక్కి..
మృతుని చిన్న కుమారుడు రిషికేష్ రెడ్డి బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. తండ్రి మృతి చెందిన విషయం తెలియడంతో రాయకుండానే వెనుదిరిగి వచ్చాడు.


