
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు తన రక్తాన్ని, చెమటను ధార పోశారు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్ల పాటు శ్రమించి వికాసం వైపు మళ్లించారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘పరిపాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత తక్కువ సమయాన్ని కేటాయించాం. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుని లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ప్రజలను మనల్ని పూర్తిగా తిరస్కరించలేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు పోదాం’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
త్వరలో శిక్షణ తరగతులు
‘బీఆర్‌ఎస్‌ను ఊదేస్తామని కొందరంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ ఉంటుంది. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలో శ్రేణులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. పార్టీ కేడర్‌కు ఇకపై తెలంగాణ భవన్‌లో సీనియర్ నేతలతో పాటు నేనూ అందుబాటులో ఉంటా. ఇకపై తెలంగాణ భవన్ మా అడ్డా.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోంది. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా నిలబడుతుంది. కేసులకు భయపడేది లేదు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలి. పార్టీలో ఎవరిపై కేసులు పెట్టినా పార్టీ యంత్రాంగం అంతా సమష్టిగా స్పందించాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్యారంటీలను గుర్తు చేస్తూనే ఉండాలి
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలతో సహా అన్నీ 420 హామీలనే విషయాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి. ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలి. రాజకీయ అక్కసుతో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న పేద గొంతుకలకు మనం అండగా నిలబడాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పార్టీ నిర్మాణంపై సమీక్ష జరగనందునే ఓటమన్న శ్రేణులు
కాగా ఈ సమీక్షలో పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ఆవేదన వెళ్లగక్కారు. 2014 నుంచీ పార్టీ నిర్మాణంపై ఎలాంటి సమీక్ష జరగనందునే ఓటమి పొందామని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ అధినేతకు చెప్పే ధైర్యం ఎమ్మెల్యేలు చేయలేదని, కాంగ్రెస్‌ను వదిలి బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశానికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన శ్రీనివాస్ కాలుపై నుంచి ఎంపీ కేశవరావు కారు వెళ్లింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి కేశవరావు దగ్గరుండి చికిత్స చేయించారు.
గ్యారంటీల అమల్లో అనుమానాలు: కడియం
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని, కర్ణాటకలో గ్యారంటీల అమలు సాధ్యం కాదని అక్కడి సీఎం సలహాదారు చెప్పారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మి పథకం తదితరాల అమలుపై సీఎం, డిప్యూటీ సీఎంకే స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా వన్ రేస్ నిధులు దురి్వనియోగమైతే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని, రద్దు చేయడం సరికాదని కడియం అన్నారు.