
సాక్షి, కామారెడ్డి జిల్లా: దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నడి బొడ్డున ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆరే. 26 శాతం ఉన్న దళిత గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మాటిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కేసీఆర్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము.. రైతు రుణమాఫీ, 50వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే 12వేల కోట్లు మాత్రమే చెల్లించారు. ఢిల్లీకి మూటలు.. తెలంగాణ ప్రజలకు మాటలు. ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఒకరు రాము, మరొకరు రెమో.. ఇద్దరి మాటలకు పొంతన ఉండదు’’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏడాదికి 60 వేల ఉద్యోగాలు ఏమయ్యాయి?. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్‌లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయడం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బట్టలు విప్పండి. మిస్ వరల్డ్‌లో లక్ష రూపాయల చొప్పున సుందరంగులకు ప్లేట్ బోజనాలు పెట్టవు. మరి దళిత బిడ్డలు చదివే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.