మెట్రో పేరుతో డ్రామాలు | KTR Fires CM Revanth Reddy and Kishan Reddy | Sakshi
Sakshi News home page

మెట్రో పేరుతో డ్రామాలు

Jun 24 2026 1:50 AM | Updated on Jun 24 2026 1:50 AM

KTR Fires CM Revanth Reddy and Kishan Reddy

సీఎం రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజం

సంస్థకు ఉన్నరూ. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులపై సీఎం కన్ను 

ప్రతి మహిళకు రేవంత్‌ రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వీడుతానని వ్యాఖ్య

గచ్చిబౌలి/మియాపూర్‌: సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ఆరోపించారు. కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి ఏదో అడిగినట్లు, కిషన్‌రెడ్డి ఏదో తీసుకొస్తున్నట్లుగా ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ, ‘సర్‌’శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ  మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులపై సీఎం రేవంత్‌  కన్నేశారని.. అందుకే అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. 

250 ఎకరాలను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్‌ అండ్‌ టీకి ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మెట్రో రైళ్లను దివాలా తేయించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్డీకాపూల్‌ నుంచి పటాన్‌చెరు వరకు గతంలో తాము ప్రతిపాధించిన మెట్రో రైలు అలైన్‌మెంట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసాంద్రత ఉన్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. 

శేరిలింగంపల్లిని రూ. 9,500 కోట్లతో అభివృద్ధి చేశాం.. 
శేరిలింగంపల్లిలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ. 9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కేటీఆర్‌ చెప్పారు. సినీహీరో రజనీకాంత్‌ శేరిలింగంపల్లి ప్రాంతాన్ని చూసి హైదరాబాద్‌లో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అనే సందేహం కలుగుతోందని అన్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు. ఒక్కో మహిళకు రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్‌ విసిరారు. 

కార్యకర్తలే డ్రైవర్లు.. 
‘కారు’కు కార్యకర్తలే డ్రైవర్లని, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ సారథ్యంలో పార్టీ కోసం అహారి్నశలూ శ్రమిస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేటీఆర్‌ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, నాయకులు రాగడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్జానవతా రెడ్డి, రోజా రంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement