సాక్షి, హైదరాబాద్: ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్‌కి అసలు మూడేళ్లు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో.. లేక మూడు నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు చూసి.. ఢిల్లీలో వాళ్ల అధిష్టానం కూడా కత్తులు నూరుతోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల తరఫున బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకి వచ్చిందని… ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. రేవంత్ రెడ్డి అంత చిల్లరగా వ్యవహరించిన నాయకుడిని చూడలేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. పెన్షన్ పెంచాలని అడిగినా.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసినా రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే.. రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థులు దాకా ప్రతి వర్గానికి మొండి చేస్తున్న రేవంత్ రెడ్డి కొత్తగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తుందంటే మాత్రం ఎవరు నమ్ముతారంటూ మండిపడ్డారు.
పదేళ్ల కేసీఆర్ పాలన ఉండేదో.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు కేటీఆర్. పదేళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఒకవైపు అభివృద్ధితో పాటు.. మరోవైపు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.


