‘ఇప్పుడు వాళ్ల టైమ్‌.. పడదాం.. మళ్లీ మన టైమ్ వస్తుంది’ | KSR's Comments On YS Jagan Slams TDP Over AP Local Body Election Issues | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు వాళ్ల టైమ్‌.. పడదాం.. మళ్లీ మన టైమ్ వస్తుంది’

Oct 20 2026 11:57 AM | Updated on Oct 20 2026 12:25 PM

KSR's Comments On YS Jagan Slams TDP Over AP Local Body Election Issues

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలలో జరుగుతున్న రాక్షసపర్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఆయా వ్యవస్థలకు మొరపెట్టుకున్నా పెద్దగా ఫలితం దక్కినట్లు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్లు వేయనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుపడుతున్న తీరు, వారికి పోలీసు వ్యవస్థ మద్దతు ఇస్తున్న వైనం, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్న దారుణమైన ఘటనలను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠాకు వైఎస్‌ జగన్ స్వయంగా వెళ్లి వివరించారు. వారి నుంచి హామీలు వచ్చినట్లు కనిపించినా, చివరికి ఏమీ జరగలేదు.

రాయలసీమలో పులివెందుల, పుంగనూరు, కడప, రాయచోటి, గుంతకల్, రాజంపేట, బద్వేలు, కమలాపురం, ప్రకాశం జిల్లాలో దర్శి తదితర చోట్ల పోలీసులే వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను అడ్డుకున్న వైనాన్ని ఆయన తెలియచేశారు. అయినా టీడీపీ నేతలకు, చంద్రబాబు సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా కాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ల పరిశీలన సమయంలో కూడా దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాల చించివేత, బెదిరింపులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉంది తెలియచేస్తుంది. 

చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో స్క్రూటిని టైమ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను భయపెట్టారని, ఛైర్మన్ అభ్యర్ధిని కిడ్నాప్ చేశారన్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఇదంతా చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్ద మచ్చగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన హెచ్చరికలు గమనించదగినవే అని చెప్పాలి. 'ఇప్పుడు వారి టైమ్ నడుస్తోంది.. కొడుతున్నారు.. మనం పడదాం.. మళ్లీ మన టైమ్ వస్తుంది..' అని ఆయన వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అంతేకాదు.. టీడీపీ గూండాలు, పోలీసుల అరాచకాలపై తిరగబడి నిలబడాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు.

జగన్ ధైర్యం ఇస్తున్న రీతిలోనే, గత మూడు నాలుగు రోజులుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోరాడుతున్న తీరుపై ఇండిపెండెంట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాడులలో గాయాలపాలై రక్తమోడుతున్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు నామినేషన్లు వేయడానికి ముందుకు వచ్చారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో టీడీపీ కిరాతకాలకు అండగా నిలుస్తున్న కొందరు పోలీసు అధికారులు రంగంలో దిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుపడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంంది. ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తూ కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు టీడీపీ నేతలతో కలిసిపోయి ఇసుక, మద్యం, భూముల మాఫియా నడుపుతున్నారని, వారే స్థానిక ఎన్నికలలో నామినేషన్ల పర్వంలో తమ బాధ్యతలు విస్మరించి, టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా కర్నూలు ఐజీ కోయ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార ధోరణి తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఆయన పేరు ప్రస్తావించి మరీ జగన్ ఆరోపణలు గుప్పించారు. పుంగనూరు ఘటనలో మిథున్ రెడ్డిపైనే ఆ అధికారి ఎదురు ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం వంటివి అనాగకరికంగా కనిపిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలి. నామినేషన్ల ఘట్టంలో ఏ అభ్యర్ధి నామినేషన్ వేయలేని పరిస్థితి ఉండరాదు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఎక్కడనుంచి ఫిర్యాదులు వచ్చినా, వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్‌లో దరఖాస్తులు తీసుకోవడం, సిసిటీవీ లైవ్ కవరేజీ వంటివాటిని ఏర్పాటు చేసి ఉంటే ఎన్నికల కమిషన్‌కు పేరు వచ్చేది. పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకునేవారు. కాని ఆ పరిస్థితి లేదు. పోలీసులపై ఆరోపణలు వస్తే వారిపై చర్య తీసుకుని ఉండాలి. ఆ పని చేయలేదంటే ఎన్నికల కమిషన్ చంద్రబాబు సర్కార్ చేతిలో ఒక పావుగా మారిందన్న సంగతి అర్థం అవుతుంది.

ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించి ఎన్నికలు సజావుగా జరగకపోతే పోయేది ఎన్నికల సంఘం పరువేనని ఆయన స్పష్టం చేశారు. అయినా ఎస్‌ఈసీ పెద్దగా ఫీల్ అవుతున్నట్లు కనిపించదు.

అనిల్ చంద్ర 2019 శాసనసభ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. అప్పట్లో ముగ్గురు పోలీసు అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకుండా కోర్టుకు వెళ్లడం వివాదాస్పదం అయింది. ఆ తర్వాత ఈయనను విధుల నుంచి సీఈసీ తప్పించింది. ఆ రోజుల్లో చంద్రబాబు పట్ల అంత విధేయతతో ఉండేవారు కనుకే ఆయన రిటైరయ్యాక తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని కట్టబెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ అపవాదు తనపై రాకుండా ఉండడానికి అనిల్ చంద్ర పెద్దగా చొరవ తీసుకోకపోవడం దురదృష్టకరం అని చెప్పాలి.

ఇదీ చదవండి: బాబూ.. ఇది ప్రజాస్వామ్యం! రాజకీయ దౌర్జన్యం కాదు!

నామినేషన్‌లు వేయలేకపోయినవారికోసం గడువు పొడిగిస్తానని ఆయన తెలిపినా, అలా చేయలేదు. దాంతో 12 మున్సిపాల్టీలు ఏకగ్రీవం అయిన పరిస్థితి ఏర్పడింది. నిజంగానే ఎవరూ పోటీచేయడానికి ముందుకు రాకపోతే అదో పద్దతి. అలాకాకుండా, తమ నామినేషన్లు తీసుకోండి, తమను రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌లోకి వెళ్లనివ్వండి అని పోలీసుల కాళ్లా, వేళ్లా పడినా కనికరించలేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

పుంగనూరు వంటిచోట్ల ఎలాగొలా కష్టపడి వెళ్లినా, రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు తీసుకోకపోవడం మరీ వైచిత్రం. పై నుంచి ఒత్తిడి వస్తోందని అధికారులు చెబుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా పరిహాసానికి గురి అవుతోందో తెలుస్తుంది. అలాగే, తిరుపతిలో వాసు యాదవ్ అనే అభ్యర్ది చాటుగా వెళ్లి నామినేషన్ వేయడానికి ఎంత కష్టపడ్డారో వింటే ఔరా అనిపిస్తుంది. నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ నేతలు రహస్య ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చిందట. చంద్రబాబు ప్రభుత్వం ఓటమి భయంతోనే బెదిరింపులు, దాడులు, హత్యాయత్నాలు, నిర్భంధాలకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు.

గతంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆద్వర్యంలోనే తమ హయాంలో ఎన్నికలు జరిగాయని, అప్పుడు ఆయన ఎంతమంది పోలీసు అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీ చేశారో గుర్తు చేసుకోవాలని జగన్ పేర్కొన్నారు. నిజంగానే ఆనాడు టీడీపీ వారు ఏది కోరితే ఆ పని నిమ్మగడ్డ చేశారన్న విమర్శ వచ్చింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నియమించిన కమిషనే కనుక చెప్పేదేముంది. ఇన్ని గొడవలు జరిగినా, ఒక్క అధికారిపై కూడా ఈసీ చర్యలు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ఎన్నికల కమిషన్ నియామక పద్దతిలో మార్పు రావాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని ఆయన ధైర్యంగా చెబుతూ గతంలో కేంద్రం తీసుకువచ్చిన చట్టానికి మద్దతు ఇచ్చి పొరుపాటు చేశామని, ఇప్పుడు తమ వైఖరి మార్చుకున్నామని ఫెయిర్‌గా చెప్పారు. చంద్రబాబు ఎప్పుడైనా ఇలా నిజాయితీగా మాట్లాడారా అన్న ప్రశ్న వస్తుంది. దానికి ఉదాహరణ చూడవచ్చు. గతంలో ఈవిఎమ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. తాను అధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తడం లేదు. ఏభై లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్న పరకాల వంటివారి ప్రశ్నపై చంద్రబాబు కనీసం స్పందించడం లేదు. ఎన్నికలలో ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ రక్త చరిత్రను సృష్టిస్తున్నారని, టీడీపీ వెన్నుపోటు పార్టీనే కాకుండా, గొడ్డలి సప్లై చేసే పార్టీ అని జగన్ ధ్వజమెత్తారు.

వ్యక్తులు, స్థానికంగా ఉండే పార్టీల మధ్య గొడవలు జరగవచ్చు. కాని వాటిని నిష్పక్షపాతంగా విచారించి గట్టి చర్యలు తీసుకోవల్సిన పోలీసు వ్యవస్థ, వీరిని నియంత్రించవలసిన ఎన్నికల కమిషన్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, అరాచకశక్తులకు అండగా నిలబడడం బాధాకరం.

వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఎల్లో మీడియా నీచమైన రాతలు కూడా ఏపీ ఆలోచనపరులను కలవరపరుస్తున్నాయి. రాజకీయం అంటే జగన్ మాదిరి ముక్కుసూటిగా వెళ్లడం కాదని, కుయుక్తులు పన్నాలని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారన్న భావన కలుగుతుంది. మహాభారతంలో ద్రౌపదిని దుశ్శాసనుడి బారీ నుంచి శ్రీకృష్ణుడు అభయహస్తం ఇచ్చి కాపాడారు. కాని ఏపీలో మాత్రం పరిహాసం పాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరూ లేరా అన్న ఆవేదన కలుగుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement