బాబూ.. ఇది ప్రజాస్వామ్యం! రాజకీయ దౌర్జన్యం కాదు! | KSR's Comments On AP Local Elections Nomination Attacks Controversy | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇది ప్రజాస్వామ్యం! రాజకీయ దౌర్జన్యం కాదు!

Oct 19 2026 11:34 AM | Updated on Oct 19 2026 11:59 AM

KSR's Comments On AP Local Elections Nomination Attacks Controversy

ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని,ప్రత్యర్ధి వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు నామినేషన్‌లు వేయకుండా చేయాలని, అధికార తెలుగుదేశం పార్టీ తన గుండాలను రంగంలో దించింది. ఏపీ ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రభుత్వపక్షమే అరాచకాలకు దిగింది. వారు ఏకంగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారంటే ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో అర్థం అవుతూనే ఉంది.

రాయచోటిలో అయితే వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడి చేసి నిప్పుపెట్టారు. అక్కడ ఉన్న వాహనాలను దగ్దం చేశారు. పులివెందులలో నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీవారిపైనే లాఠీచార్జీ చేశారు. తుపాకులు పేల్చారు. పుంగనూరు మున్సిపాల్టీలో నామినేషన్ వేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులకు మద్దతుగా మిథున్‌ వెళుతున్నప్పుడు టీడీపీ రౌడీలు కర్రలు, కత్తులు, రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీవారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి జరిగే అవకాశం ఉందని తెలిసినా, పోలీసులు చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషించారంటే ఆ వ్యవస్థ ఎంతగా పతనం అయింది తెలుస్తుంది.

వాహనాలను ధ్వంసం చేసి తిరగవేశారంటే ఏమనుకోవాలి. ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద గందరగోళం సృష్టించబోయిన సమయంలో మాత్రం పోలీసులు గాలిలో కాల్పులు జరిపారట. ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తే మిథున్‌ రెడ్డిపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. దానికి పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మిథున్‌ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్లు వేయబోతున్నారని తెలిసినా, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదంటేనే అసాంఘీక శక్తులతో కుమ్మక్కయ్యారన్న విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.

చంద్రబాబు, లోకేష్‌ల సూచనలతోనే టీడీపీ గూండాలు ఇలా విజృంభిస్తున్నారని మిథున్‌ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు సరిగ్గా పుంగనూరు వద్దే ఆనాటి విపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్తలనండి, గూండాలనండి అప్పుడు కూడా విధ్వంసం సృష్టించారు. టీడీపీ వారు విసిరిన రాళ్లతో పోలీసులు గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. పోలీసు వాహనాన్ని సైతం ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ అరాచకం చేయగలిగిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలాకాకుండా మరొలా ఎలా ప్రవర్తిస్తుందన్న చర్చ సహజంగానే వస్తుంది. పైగా ఆనాటి విధ్వంసాన్ని పరోక్షంగా టీడీపీ నాయకత్వం సమర్థించుకునే యత్నం చేసింది.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అల్లర్లు జరిగితే పెట్టుబడులు పెట్టేవారు భయపడతారని ఆయనే చెబుతుంటారు. కాని గత రెండేళ్లుగా టీడీపీ సాగించిన విధ్వంసం అంతా, ఇంతా కాదు. రెడ్‌బుక్ పేరుతో పలువురు విపక్ష నేతలను, కార్యకర్తలను తప్పుడు కేసుల్లో అరెస్టు చేయడం రొటీన్ అయిపోయింది.

పల్నాడులో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లపై పడి టీడీపీ రౌడీలు అరాచకాలు చేశారు. వినుకొండ తదితర చోట్ల కొందరు హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గంటల తరబడి టీడీపీ రౌడీలు స్థానిక ఎమ్మెల్యే పర్వవేక్షణలో దాడి చేస్తే వారెవరిని అరెస్టు చేయలేదు. పైగా అంబటిపైనే తప్పుడు కేసు పెట్టి జైలులో ఉంచారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు పోలీసుల సమక్షంలోనే విసిరినా వారికి ఏమీ కాలేదు. పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న బెదిరింపులు ఇన్నీ అన్నీ కావు.

ఇదీ చదవండి: చంద్రబాబుపై కేసులు.. రిటైర్డ్ జడ్జీలకు పదవుల గిఫ్టా?

ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలలో టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందని ఊహించిన సంగతే. కాని నామినేషన్ల తొలిరోజే ఇంతగా బరితెగించి దాడులు చేస్తుందని అనుకోలేదు.

పోలీసులను ప్రయోగించి వైఎస్సార్‌సీపీవారిని భయపెడుతుందని అంతా భావించారు. ఒకవైపు అవి జరుగుతుంటే, మరోవైపు టీడీపీ గూండాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి దాడులు చేస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వైఎస్సార్‌సీపీవారికి ఫోన్ చేసి భయపెడుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత ఒకరికి ఫోన్ చేసి నామినేషన్ వేస్తే జరిగేపరిణామాలపై హచ్చరిక చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నామినేషన్ల రోజున నిజంగానే అంత పని జరిగింది.

వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌కు టీడీపీ అరాచక శక్తులు నిప్పు పెట్టాయి. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. దాచేపల్లి వద్ద అభ్యర్ధి అయ్యే ఒకరి ఇంటిలో మద్యం కేసులో ఇరికించి పోలీసులు వచ్చి తీసుకువెళ్లిపోయారట. కొన్ని చోట్ల మహిళా అభ్యర్ధులపైనా దౌర్జన్యాలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గతంలో జరిగినప్పుడు పోలీసులు, కొందరు అధికారులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్థానికులను ఓటు వేయనివ్వకుండా పోలీసులే అడ్డుకున్నారు. అప్పుడే ఇలా చేసిన పోలీసులు ప్రస్తుతం రాష్ట్రం అంతటా జరుగుతున్న ఈ ఎన్నికలలో సక్రమంగా పనిచేస్తారా?అన్నది చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల అండ లేకుండా తాము గెలిచే పరిస్థితి లేదన్న అనుమానంతోనే ఇలాంటి అక్రమాలకు ఒడిగడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నది చాలామంది భావన. దానిని తట్టుకోవడం కష్టం కనుక పోలీసులపైనే కూటమి పార్టీలు ఆశలు పెట్టుకున్నాయని అంటున్నారు. దాంతో వీరభక్తి ప్రదర్శించే కొందరు అధికారులు పలు చోట్ల వైఎస్సార్‌సీపీ క్యాడర్‌పై రకరకాల కేసులు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత శుక్రవారం నాటికే 1688 మందిపై బైండోవర్ కేసులు పెట్టారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. కేవలం వైఎస్సార్‌సీపీవారిపై ఇలాంటి కేసులు పెట్టి, టీడీపీవారిపై కేసులు పెట్టకపోవడమే కాకుండా, వారి దౌర్జన్యాలకు పోలీసులు అండగా నిలబడుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం చేశారు. ఈ అంశాలన్నిటిపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు హైకోర్టుకు వెళుతోంది.

గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినప్పుడు టీడీపీ కోసం ఎంతగా అక్రమాలకు ఒడిగట్టింది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ పునేఠా ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరగడం లేదంటే చంద్రబాబుకోసమే ఇవి పనిచేస్తున్నాయన్న భావన కలుగుతుంది. పోలీసులైతే యథాప్రకారం దాడులు చేస్తున్నవారికి భద్రత కల్పించడం ఒక ఎత్తు అయితే బాధితులపై ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. అచ్చంగా టీడీపీ తరపున లాయర్ల మాదిరి మాట్లాడుతున్నారు. మిథున్‌ రెడ్డిపై దాడిపై చర్య తీసుకుంటామని చెప్పవలసిన పోలీసు అధికారి, ఆయనపైనే ఆరోపణలు చేశారంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

నామినేషన్లను ఆన్‌లైన్‌లో వేసుకునే పద్దతి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ కోరినా ఎన్నికల కమిషన్ సిద్దం కాకపోవడం వల్లే ఈ అరాచకాలకు ఆస్కారం ఇచ్చినట్లయిందనిపిస్తుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధుల నామినేషన్‌లకు అడ్డంకులు లేకుండా చేయగలిగితే అదే పదివేలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.

వైఎస్సార్‌సీపీవారిపై దాడులు చేయడమే కాకుండా జనంలో నెగిటివ్ వస్తుందన్న భయంతో వెంటనే టీడీపీ నాయకులను రంగంలో దించి వైఎస్సార్‌సీపీనే దాడి చేసిందంటూ ఎదురు ఆరోపణలు చేయించారు. వైఎస్సార్‌సీపీ వారు తమ కార్లను తామే ధ్వంసం చేసుకున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తారేమో తెలియదు. చంద్రబాబు ప్రభుత్వం పైకి నీతులు చెబుతుంటుంది. లోపల మాత్రం ఇలాంటి అల్లర్లను ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement