ముంబై: ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన కొద్ది గంటలకే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న ఒకరు ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ గాయమైంది.
సల్మాన్‌తో జతకట్టాడనే..
వెలుగులోకి వచ్చిన ఆడియో ఫైల్‌లో తనను తాను 'అనిల్ పండిత్'గా పరిచయం చేసుకున్న వ్యక్తి, లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో తమకున్న సంబంధాన్ని పేర్కొన్నాడు. తమ ముఠా ఆదేశాలను బేఖాతరు చేస్తూ టైగర్ ష్రాఫ్ సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం కొనసాగించినందునే ఆయనను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
‘సల్మాన్.. దావూద్ కుక్కలాంటోడు’
‘చిత్ర పరిశ్రమలో ఎవరైనా మాకు వ్యతిరేకంగా పనిచేసినా, లేదా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినా వారిని చంపేస్తాం. ఇదే మొదటి, చివరి హెచ్చరిక. ఈ సల్మాన్ ఖాన్ దావూద్ (ఇబ్రహీం) కుక్క, మేము మా ఇంట్లో దావూద్ అనే పేరుతో ఒక కుక్కను పెంచుకుంటున్నాం. గతంలో మేము అతనికి ఫోన్ చేసి సర్దిచెప్పాం, కానీ అతను అర్థం చేసుకోలేదు. అందుకే ఈరోజు అతనికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాం’ అని పేర్కొన్నాడు.
డ్రైవర్‌కు గాయాలు
మీడియా నివేదికల ప్రకారం, ఆదివారం సాయంత్రం జుహులో జరిగిన ఈ కాల్పుల ఘటనలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉంది. టైగర్ ష్రాఫ్ ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో నటుడు గాయపడకుండా తప్పించుకోగా, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ తగిలింది. ఈ కాల్పులకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలు, వారి ఖచ్చితమైన ఉద్దేశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టాప్ 10లో సల్మాన్ నెం. 1
1998 నాటి కృష్ణజింకల వేట కేసు వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ పదేపదే బెదిరింపులకు దిగుతున్నాడు. ఆనాటి వేట ఘటన బిష్ణోయ్ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, తాము హతమార్చాలనుకుంటున్న పది మంది ప్రధాన లక్ష్యాల జాబితాలో సల్మాన్ ఖాన్‌ను అగ్రస్థానంలో ఉంచినట్లు బిష్ణోయ్ గతంలో తెలిపాడు. అప్పటి నుండి సల్మాన్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆదివారం కాల్పుల ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి: కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష


