సాక్షి, విశాఖపట్నం: ‘కుర్చీలో కూర్చోవడమే మీ అజెండా.. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ అజెండా..’ ఇది వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన పాటలోని ఒక లైన్. ఇది అక్షరాలా నిజమని ప్రజలకు చెప్పింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ప్రజాతీర్పును పాతాళానికి తొక్కి.. ప్రజాస్వామ్య విలువల గొంతు కోసి.. విశాఖను కబళించేసింది. అభివృద్ధి వెలుగులతో విరాజిల్లిన నగరాన్ని పీఠం దక్కించుకోవాలన్న కక్కుర్తితో కారుచీకట్లలోకి నెట్టేసింది. జీవీఎంసీలో కనీస బలం లేకపోయినా.. ప్రలోభాలు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌తో వైఎస్సార్‌సీపీ నుంచి మేయర్ పీఠాన్ని దొడ్డిదారిన లాక్కుంది.
గ్రేటర్ చరిత్రలో బ్లాక్ డేగా..!
2021 జీవీఎంసీ ఎన్నికల్లో మహా విశాఖ నగర ప్రజలు వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి మేయర్ పీఠాన్ని అప్పగించారు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్షసాధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లను బెదిరింపులు, వ్యక్తిగత బ్లాక్‌మెయిలింగ్, ప్రలోభాలతో కూటమిలోకి లాక్కున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీసీ మహిళా మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై బలవంతంగా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం పార్టీ అడ్డగోలు ఫిరాయింపులతో మేయర్ పీఠాన్ని లాక్కోవడం విశాఖ నగర చరిత్రలో చీకటి అధ్యాయంగా, మాయని మచ్చగా 2025 ఏప్రిల్ 19న నిలిచిపోయింది.
‘గీతం’ కోసం గూడుపుఠాణీ
కూటమి ప్రభుత్వం అడ్డదారిలో మేయర్ పీఠంపై పీలా శ్రీనివాసరావును కూర్చోబెట్టడం వెనుక అసలు కుట్ర 2026 జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో బట్టబయలైంది. లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌కు చెందిన ‘గీతం’ విశ్వవిద్యాలయం ఆ«దీనంలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను క్రమబదీ్ధకరించే (రెగ్యులరైజ్) తీర్మానాన్ని కౌన్సిల్ ముందుకు తెచ్చారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.5 వేల కోట్ల విలువైన రుషికొండ, ఎండాడ పరిధిలోని ఈ భూములను నామమాత్రపు ధరలకే కట్టబెట్టేందుకు జీవీఎంసీని వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
మైకులు కట్ చేసి.. సీసీటీవీలు బంద్ చేసి..!
గీతం వర్సిటీ భూముల తీర్మానాన్ని ఆమోదించుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించింది. 2026 జనవరి 30నాటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ, వామపక్ష కార్పొరేటర్లు భూదోపిడీని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు వారి మైకులను కట్ చేయడంతో పాటు, అక్రమాలు బయటకు తెలియకుండా మీడియాను లోపలికి రానివ్వకుండా నిషేధించారు. సీసీటీవీలను కూడా ఆపేశారు. కనీస చర్చ లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే అజెండాలోని అన్ని అంశాలను, ముఖ్యంగా 15వ అంశంగా ఉన్న గీతం భూముల క్రమబద్ధీకరణ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించి సభను వాయిదా వేసి అప్రజాస్వామికంగా వ్యవహరించారు.
నాడు వెలుగులు.. నేడు చీకట్లు
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ నగరం ప్రగతి పథంలో దూసుకుపోయింది. నగరాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో పాటు ప్రపంచస్థాయి హబ్‌గా తీర్చిదిద్దేందుకు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రధాన జంక్షన్ల సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన, రోడ్ల విస్తరణ, రక్షిత మంచినీటి పథకాలు, పేదల గృహనిర్మాణం వంటి బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్‌లోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధి కుంటుపడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రారంభించిన ప్రజాపయోగకరమైన ప్రాజెక్టులను రాజకీయ కక్షతో పక్కనబెట్టింది. కొత్తగా నిధులు కేటాయించకపోగా, జీవీఎంసీకి చెందిన రూ.1,700 కోట్ల నిధులను దారి మళ్లించేశారు.
మళ్లీ మేయర్ అయితే ఉన్నవీ ఊడ్చేస్తారు..!
అక్రమంగా గద్దెనెక్కి ఏడాది పాటు దోపిడీ పర్వాన్ని కొనసాగించిన కూటమి నేతలు.. ఇప్పుడు మళ్లీ కుట్రలు, కుతంత్రాలతో, మాయమాటలు చెప్పి గద్దెనెక్కాలని తీవ్రంగా యతి్నస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి, ఓటుకు నోటే ఆయుధంగా చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ శతకోటి దొంగల ముఠా కుట్రలను, విశాఖ సంపద దోపిడీని నగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వీరికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమనే మాట అందరి నోటా వినిపిస్తోంది.


