సాక్షి,వైఎస్సార్: పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మక వాతావరణానికి, రాజకీయ రగడకు కేంద్ర బిందువుగా మారింది. పులివెందులలో టీడీపీ దౌర్జన్యకాండకు తోడు, పోలీసుల ఏకపక్ష వైఖరి హద్దులు దాటింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని అడ్డుకోవడమే కాకుండా, పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులపైనే తిరిగి ఎదురు కేసులు బనాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే విచక్షణారహితంగా బలప్రయోగానికి పాల్పడ్డారు. పులివెందుల ఎస్‌డీపీవో తన పిస్టల్‌తో 8 రౌండ్లు కాల్పులు జరపగా, సీఐ పురుషోత్తం రాజు పిస్టల్‌తో 10 రౌండ్లు, తొండూరు ఎస్‌ఐ పిస్టల్‌తో 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక అంతటితో ఆగకుండా, ఏకే-47 రైఫిళ్లతో పోలీస్ కానిస్టేబుల్ భాస్కర్ 7 రౌండ్లు, కానిస్టేబుల్ రవికుమార్ నాయక్ 4 రౌండ్లు కాల్పులు జరిపారు.
కేవలం కాల్పులతోనే సరిపెట్టకుండా.. వజ్ర వాహనం ద్వారా 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్ ప్రయోగించారు. గ్యాస్ గన్‌తో 3 స్టన్ షెల్స్ ఫైర్ చేయగా, ఏకంగా వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని 7 హ్యాండ్ గ్రనేడ్లు విసిరినట్లు సమాచారం. ఈ దాడులతో పులివెందుల ఒక్కసారిగా అట్టుడికిపోయింది.
బాధితులపైనే ఎదురు కేసులు.. 662 మందిపై నమోదు
నామినేషన్ల సందర్భంగా అభ్యర్థుల్ని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడమే కాకుండా, తిరగబడిన బాధితులపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టి తమ ప్రతాపం చూపారు. సీఐ పురుషోత్తం రాజుపై హత్యాయత్నం చేశారంటూ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏతో పాటు మరో 661 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, విధులకు ఆటంకం కలిగించారంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో సహా మొత్తం 662 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడా నామినేషన్లు వేయకుండా, బయట తిరగకుండా ప్రతి నాయకుడిపై ఈ విధంగా అక్రమ కేసులు మోపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఎన్నికల సంఘానికి ఎంపీ అవినాష్ ఫిర్యాదు
పులివెందులలో జరుగుతున్న ఈ పరిణామాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తూ టీడీపీకి తొత్తుగా మారాడని ఆరోపించారు. పోలీసుల దుశ్చర్యలు, ఏకపక్ష ధోరణిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి భయపెడుతున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


