చంద్రబాబుపై కేసులు.. రిటైర్డ్ జడ్జీలకు పదవుల గిఫ్టా? | KSR's Comments On AP HRC Chairman Judicial Appointment Controversy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై కేసులు.. రిటైర్డ్ జడ్జీలకు పదవుల గిఫ్టా?

Oct 16 2026 1:03 PM | Updated on Oct 16 2026 2:58 PM

KSR's Comments On AP HRC Chairman Judicial Appointment Controversy

న్యాయ వ్యవస్థ దేశంలో అత్యంత కీలకమైనది. దురదృష్టవశాత్తు ఆ వ్యవస్థ కూడా తరచూ విమర్శలకు గురి అవుతోంది. సుప్రింకోర్టు, హైకోర్టు జడ్జిలుగా పనిచేసినవారు ప్రభుత్వాలు నియమించే పదవులలో చేరవచ్చా? లేదా? అన్న చర్చ తరచుగా జరుగుతోంది. లా కమిషన్ సైతం జడ్జిలు పదవీకాలం పూర్తి అయ్యాక ప్రభుత్వ పదవులలోకి వెళ్లడాన్ని సమర్ధించలేదు. న్యాయమూర్తులు అంతా వివాదాస్పదంగా ఉంటారని చెప్పజాలం. కాని కొన్నిసార్లు రిటైర్డ్ జడ్జిలే బాధ్యత తీసుకోవల్సిన పదవులలో వారి నియామక ప్రాతిపదిక చర్చనీయాంశంగా మారుతోంది.

ఆయా కేసులలో ఆ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు, వ్యవహార శైలి, కేసుల విచారణలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినప్పుడు, వారు రిటైరైన తర్వాత పోస్టులు పొందడం కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి కొందరు తెలివిగా తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలో తాజాగా మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి ఎం.సత్యనారాయణమూర్తిని నియమించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

నిజానికి ఈ పదవిలో రిటైర్డ్ జడ్జిలను నియమించవచ్చు. కాని ఈయననే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న ప్రశ్నకు హేతుబద్దమైన జవాబు దొరికితే ఫర్వాలేదు. అలాకాకుండా కేవలం గతంలో తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొన్నిసార్లు వ్యవహరించారన్న కారణంగా ఇలాంటి పదవులు ఇస్తే వ్యవస్థలు దెబ్బతింటాయన్నది న్యాయ నిపుణుల ఆవేదనగా ఉంది.

కొద్ది నెలల క్రితం ఏపీ లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ మల్లిఖార్జునరావును చంద్రబాబు ప్రభుత్వం అప్పాయింట్ చేసింది. అప్పుడు కూడా తీవ్ర విమర్శలు చెలరేగాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మల్లిఖార్జునరావు న్యాయమూర్తి హోదాలో బెయిల్ మంజూరు చేశారు. మామూలుగా అయితే బెయిల్ ఇవ్వడాన్ని ఆక్షేపించజాలం. 

కాని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయించకుండా, ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. పలు వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయని ఆరోగ్య కారణాలతో బెయిల్ లభించింది. కాని చిత్రంగా బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా గంటల తరబడి ఆయన ఊరేగింపుగా ప్రయాణం చేశారు. ఇది ఒకరకంగా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించే విషయం అవుతుందన్నది కొందరి అభిప్రాయం. కాని న్యాయ వ్యవస్థ దాని జోలికి వెళ్లలేదు. అది వేరే సంగతి.

ఆయా ప్రసంగాలలో తన ఆరోగ్యం ఎంత గట్టిదో కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్యే ఒక సభలో మాట్లాడుతూ.. ఢిల్లీలో తాను ప్రధానితో పాటు ఎనిమిది మంది మంత్రులను కలిసి ఆయా అంశాలపై చర్చించానని, తదుపరి అమరావతి వచ్చాక రాత్రి మళ్లీ విశాఖ పెట్టుబడుల సదస్సుపై సమీక్ష చేశానని, అర్ధరాత్రి ఒకటిన్నరకు నిద్రపోయి, తిరిగి ఉదయం ఒంగోలు వచ్చానని చెప్పుకున్నారు. కాని ఆయన జైలులో ఉన్నప్పుడు ఎల్లో మీడియాలో ఆయనకు ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వివరిస్తూ, అనేక కథనాలను ప్రచారం చేసింది.

ఇక సత్యనారాయణమూర్తికి హెచ్ఆ‌ర్‌సీ చైర్మన్ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబు బహుహానం ఇవ్వడమేనని మీడియాలో కథనం వచ్చింది. ఈ ఎంపిక జరిగిన తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రితో పాటు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఈ కమిటీలో ఉంటారు. బొత్సకు ఈ కమిటీ సమావేశం జరగడానికి కొద్ది గంటల ముందు సమాచారం ఇచ్చారట. తాను అమరావతిలో లేనని, విజయనగరంలో ఉన్నానని, ఆరోగ్య ఇబ్బంది ఉందని, అందువల్ల సమావేశం వాయిదా వేయాలని ఆయన కోరారట. అయినా పట్టించుకోకుండా ఈ ఎంపిక చేసేశారు. అంటే బొత్స వస్తే సత్యనారాయణ మూర్తి ఎంపికపై అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉందని భావించడమే కారణమని వెఎస్సార్‌సీపీ ఆరోపణ.

గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం చేసినప్పుడు హైకోర్టులో పిల్ పడింది. దానిని విచారించిన త్రిసభ్య ధర్మాసనంలో ఈయన కూడా ఉన్నారు. ఈయన బెంచ్‌లో ఉండడాన్ని ప్రభుత్వం ఆక్షేపించింది. అయినా ఆయన తాను కొనసాగుతానని నిర్ణయించుకున్నారు. తదుపరి అసలు చట్టాన్నే ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అయినా తాము విచారణ చేస్తామంటూ చిత్రమైన రీతిలో కోర్టు వ్యవహరించిందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. పైగా ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించడంపై అంతా ఆశ్చర్యపోయారు. అసలు రాజధానికి సంబంధించి చట్టం చేసే అధికారం అసెంంబ్లీకి లేదని కోర్టు చెప్పడం విడ్దూరంగా ఉందని వ్యాఖ్యలు వచ్చాయి.

ఇదీ చదవండి: అధికారం ఉంటే.. ఈడీ, సీబీఐ ఆయుధమేనా?

పలుమార్లు జగన్ ప్రభుత్వం ఇచ్చే జీఓల గురించి వాకబ్ చేసి ఎవరైనా పిల్ వేశారా అని ప్రశ్నించేవారని ఒక న్యాయవాది వ్యాఖ్యానించారు. ఈయనకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నది మరో ఆరోపణ. రెండేళ్లుగా ఈ పదవిని ఖాళీగా ఉంచి ఇప్పుడు ఈయనతో భర్తీ చేశారు. దీనికి ముందు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణకు ఈయననే కమిషన్‌గా నియమించారు. అందులో ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బంది రాకుండా రిపోర్టు ఇచ్చారని చెబుతారు. చంద్రబాబు స్టైలే అలా ఉంటుంది.

గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటపై విచారణకు వేసిన కమిషన్ న్యాయమూర్తి కూడా ప్రజలను, మీడియాను తప్పుపట్టి సరిపెట్టారు. అంతే తప్ప, ముఖ్యమంత్రి కుటుంబం ఆ ఘాట్‌లో స్నానం చేయడంకోసం, భక్తులను నిలిపివేయడం వల్ల తొక్కిసలాట జరిగిందా? లేదా? అన్నదానికి వెళ్లినట్లు అనిపించదు. తాజాగా సత్యనారాయణమూర్తిని నియమించడం కూడా వివాదాస్పదం అయింది.

ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఒక పెద్ద జాఢ్యంగా మారింది. ఉదాహరణకు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై అరికాళ్లపై కొట్టి హింసించిన ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసి శవాన్ని దహనం కూడా చేశారు. పోలీసుల ఘాతుకాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి వెఎస్సార్‌సీపీకి చెందినవారిని పలురకాలుగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయి. అన్నిటికి ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించవలసి వస్తోంది.

వచ్చే రెండున్నరేళ్లు కూడా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో మరిన్ని అరాచకాలు చేసి పౌరుల హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉంది. అలాంటి కేసులలో నిష్పక్షపాతంగా ఈయన చేయగలుగుతారా? లేదా? అన్నది సహజంగానే చర్చ అవుతుంది. పక్షపాత రహితంగా చేయగలిగితే మంచిదే. కాని మీడియాలో ఈయనపై వచ్చిన కథనాలు చదివితే తెలుగుదేశంతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. వాటిని అధిగమించుతారా? లేదా అన్నదే ప్రశ్న.

గతంలో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలను కొందరు గుర్తు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి నియమాకాలు కొత్తవికావు. సుప్రింకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసినవారు గవర్నర్లు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కేసులో కీలకమైన తీర్పు ఇచ్చిన ఒక ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు అవడం, ఆయన సభలోకి రాగానే విపక్షం హేళన చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు టీడీపీకి చెందిన కొందరిని న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టిన వైనంపై పలు స్టోరీలు ప్రచారంలో ఉంటాయి.

గతంలో వైఎస్ జగన్‌పై సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే సీబీఐ విచారణకు అప్పట్లో ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిటైరైన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. కొంతకాలం క్రితం ఏ.కే సిక్రి అనే సుప్రింకోర్టు జడ్జికి ఒక పదవిని కేంద్రం ఇవ్వడానికి ప్రతిపాదించింది. తొలుత ఆయన అంగీకరించినా, తదుపరి వచ్చిన విమర్శల కారణంగా ఆయన ఆ పదవిని తోసిపుచ్చారు.

ఏపీలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఒకరు జగన్ టైమ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆయనకు ఒక ట్రిబ్యునల్ పదవి లభించింది. కాని అక్కడ ఆయన తీర్పులు ఇచ్చిన వైనంపై సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టవలసిన న్యాయమూర్తులే రిటైరయ్యాక వచ్చే పదవులకు ఆకర్షితులై, ప్రజాప్రయోజనంతో కాకుండా, రాజకీయ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే దేశానికి ఎంత నష్టం కలుగుతుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement