సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా/తిరుపతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మరోవైపు తిరుపతిలో వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన మహిళను టీడీపీ నాయకులు అడ్డుకుని నామినేషన్ పత్రాలను చించేశారు. ఆమెపై దాడి జరిగినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల మేరకు.. ధర్మవరంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ, బీజేపీ కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పుష్పమణికి తీవ్ర గాయాలయ్యాయని, ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.
ఇక తిరుపతిలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళ జుట్టు పట్టుకుని లాగడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం సరికాదని, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.
తిరుపతిలో వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ మహిళపై దాడికి దిగిన టీడీపీ నాయకులు! MORE సూపర్ మార్కెట్ వద్ద మహిళను అసభ్యంగా తాకుతూ, జుట్టు పట్టి లాగి, చేతిలోని నామినేషన్ పత్రాలను చింపివేసి అరాచకం సృష్టించారు. ఇదంతా అక్కడి CCTV కెమెరాల్లో రికార్డయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును కాలరాస్తూ, మహిళలపై ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం. దోషులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
— Shiva Mani 🚬 (@NaperuShivaMani) October 16, 2026
తిరుపతిలో కార్పొరేటర్గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి చేసి, నామినేషన్ పత్రాలు చింపివేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు https://t.co/IzwNQb0RiN
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2026


