కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారంలో ఉన్నవారికి రాజకీయ ఆయుధంగా మారుతోందా!ఈ ప్రశ్న ఎప్పటినుంచో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ హయాంలో కూడా అదే విమర్శకు గురి అవుతుండడమే గమనించవలసిన అంశంగా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సీబీఐ , ఈడీ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను సొంత ప్రయోజనాలకు వాడుతోందని బీజేపీ ఆరోపించేది. సరిగ్గా అదే రీతిలో బీజేపీ కూడా చేస్తున్నట్లు అనిపిస్తుంది. విశేషం ఏమిటంటే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏపిలో ఈడీని నడుపుతూ వైఎస్సార్సీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఉసికొల్పుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
వైఎస్సార్సీపీకి సంబందించిన పలువురు నేతలపై ఏవో దిక్కుమాలిన కేసులు పెట్టి తొలుత రాష్ట్ర పోలీసులు, ఆ తర్వాత ఈడీ వంటి సంస్థలను పురికొల్పుతున్నారు. చిత్తశుద్దితో ఈ సంస్థలు పనిచేయడం లేదన్న ఆరోపణలు దేశం అంతటా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెకు, బీజేపీకి ఒక తేడా ఉంది. సోనియాగాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీలవారిపైతో పాటు, అత్యధికంగా తన సొంత పార్టీవారిపై కూడా ఏవేవో కారణాలతో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలను ప్రయోగించేవారన్న అభిప్రాయం ఉండేది. కడప ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ కాంగ్రెస్కు దూరం అయి సొంత పార్టీని పెట్టుకుని బలమైన శక్తిగా ఎదగగానే ఆయనపై ఈ సంస్థలన్నీ దాడులు చేయడాన్ని మించిన సాక్ష్యం ఏమి ఉంటుంది.
బీజేపీ మాత్రం అందుకు భిన్నమైన రీతిలో ఎక్కువ సందర్భాలలో ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను బలహీనపరచడానికి ఈ సంస్థలను వాడుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ ప్రత్యర్ది రాజకీయ పార్టీల నేతలు బీజేపీకి మద్దతుదారులుగా మారిపోతే వాషింగ్ మెషిన్లో వేసి శుద్ది చేసేసినట్లు ఆ ఆరోపణలన్నీ పక్కకు పోతుంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ టీడీపీ అదినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన కేసులే అని చాలామంది నమ్ముతారు. 2018లో ఆయన బీజేపీకి దూరం అయినప్పుడు ఆయా సభలలో ఒక మాట అంటుండేవారు. సీబీఐ,ఈడీలను పంపి తమను ఇబ్బంది పెడతారా?అని ప్రశ్నించేవారు.
ఇదీ చదవండి: చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా?
సీబీఐ తనను అరెస్టు చేయడానికి వస్తే ప్రజలంతా తన చుట్టూ నిలబడాలని కూడా ఆయన కోరిన ఘట్టం కూడా ఉంది.2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిన కొద్ది కాలానికే ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాసరావు నివాసాలపైన ,కొన్ని కాంట్రాక్టు కంపెనీలపైన దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాంట్రాక్టులలో జరిగిన అక్రమాల విలువ రెండువేల కోట్ల వరకు ఉంటుందని అదికారికంగా ప్రకటించారు.అలాగే ఆదాయపన్ను శాఖ కూడా చంద్రబాబుకు నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో కాని, ఆ కేసులలో సీబీఐ జోక్యం చేసుకోలేదు. ఈడీ అంతకన్నా రాలేదు. గజం మిద్య, పలాయనం మిద్య అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమి ఉంటుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో విలీనం అయిపోయారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీపైన, ప్రధాని మోడీపైన విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. తమ జోలికి ఈ సంస్థలు రాకుండా రాయబారం కూడా చేసుకున్నారని అంటారు.
అందువల్లే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై పెట్టిన ఏ కేసును సీబీఐ, లేదా ఈడీ తీసుకోవడానికి ముందుకు రాలేదని చెబుతారు. స్కిల్ స్కామ్ను తొలుత వెలికితీసింది ఈడీ అయినా, అందులో చంద్రబాబు పాత్రపై ఆరోపణలు వచ్చినా ఆ సంస్థ మాత్రం ఆయన జోలికి వెళ్లలేదు. చంద్రబాబు పిఎస్ ఇంటిపై సోదాల సందర్భంలో రెండువేల కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణలు వచ్చినా, కదలని కేంద్ర దర్యాప్తు సంస్థలు కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్పై మూడు కోట్ల రూపాయల ఆరోపణల కేసులో ఎన్నిసార్లు దాడులు చేశాయో, ఎంతగా ఆయన కుటుంబాన్ని వేదించాయో చెప్పలేం. సిపిఎం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. దేశంలో ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. దానిని ఎవరూ కాదనరు. కాని ఇలా కేంద్రంలో అదికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు తొత్తుగానో, చేతిలో ఆయుధంగానో మారాయన్న విమర్శలు వస్తే, ఆ సంస్థల క్రెడిబిలిటి దెబ్బతింటుంది.
కాని వర్తమాన రాజకీయాలలో ఆ విషయాన్ని అధికారంలో ఉన్నవారు కాని, ఆ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా పట్టించుకోవడం లేదు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సువేందుపైన, అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత్పైన వారు ప్రత్యర్ది పార్టీలలో ఉన్నప్పుడు స్వయంగా ప్రధాని మోడీనే ఆరోపణలు గుప్పించారు. వారు బీజేపీలోకి రాగానే అవేమైపోయాయోకాని , సీఎంలు అయిపోయారు. చంద్రబాబుపైన కూడా అప్పట్లో మోడీ అవినీతి ఆరోపణలు చేస్తూ పోలవరం, అమరావతిలు ఏటీఎంలుగా మార్చుకున్నారని ద్వజమెత్తారు. అలాగే మోడీ పైన తీవ్రమైన అవినీతి ,ఇతర ఆరోపణలను చంద్రబాబు అప్పట్లో గుప్పించేవారు. 2024 ఎన్నికలనాటికి అవన్ని గప్ చుప్ అయిపోయాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వచ్చారు. వారితో మాట్లాడిన కొత్త విషయాలేవీ లేవు. పాత కోర్కెలనే మరోసారి కోరారు.
ఈ నేపధ్యంలో ఈడీ యాక్టివ్ అవడం , జగన్పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటివి జరగడంతో చంద్రబాబు టూర్కు, దీనికి ఏమైనా సంబందం ఉందా అన్న సందేహం వైఎస్సార్సీపీ వర్గాలలో ఉంది. మద్యం పేరుతో ఒక కల్పిత స్కామ్ ను ఏపి ప్రభుత్వం సృష్టించితే, వెంటనే ఈడీ రంగంలో దిగింది. గత టరమ్లో వైఎస్సార్సీపీ పాలనలో సిఐడి పలు ఆధారాలు చూపి స్కిల్ స్కామ్ ,అమరావతి స్కామ్ లపై కేసు లుపెట్టినా, వాటిపై దర్యాప్తు చేయాలని సీబీఐ , ఈడీ వంటివాటిని కోరినా ఎందుకు ముందుకు రాలేదో అర్ధం కాదు.2011లో జగన్ పై కాంగ్రెస్, టీడీపీలు కలిసి కేసులు పెట్టాయి. అప్పట్లో ఒక కేసే పెడితే జగన్ తేలికగా జైలు నుంచి బయటకు వచ్చేస్తారని భావించారో ఏమోకాని, సీబీఐ పదకుండు కేసులు పెట్టింది. తదుపరి ఈడీ కేసులు నమోదు చేసింది.సుమారు 135 మందిని కూడా నిందితులుగా చేర్చారు.
జగన్ను అయితే ఈ నెపంతో ఎక్కువకాలం జైలులో ఉంచగలిగారు కాని, ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణను తగ్గించలేకపోయారు. అంతేకాక ఇన్ని కేసులు అవడంతో ఆయా నిందితులు పలువురు ఎవరికివారు కోర్టుకు వెళ్లి స్టే లు పొందారు.దాదాపు అన్ని కేసులలోను ఇదే పరిస్థితి ఏర్పడింది.దాంతో సీబీఐ కోర్టులో ఈ కేసులు ఒక పట్టాన తేలే పరిస్థితి లేదు. విశేషం ఏమిటంటే ఈ కేసులన్నిటిని ఒక కేసుగా మార్చి సత్వరమే విచారణ జరపాలని 2013లోనే జగన్ కోరారు. అయినా ఆ రకంగా న్యాయస్థానాలు చేయలేదు.
ఈ పరిస్థితిలో ఈడీ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి జగన్ కేసులను త్వరగా విచారించాలని, జగన్ రోజువారి విచారణకు రావాలని కోరింది. ఇక్కడే రాజకీయం కనిపిస్తుంది. జగన్ కోర్టుకు రావల్సిన అవసరం ప్రత్యేకంగా ఏమీ లేదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. లాయర్లు ఆ కేసులపై వాదనలు చేస్తున్నారు. పైగా సీబీఐ కోర్టులో ఉన్న కేసులపై తీర్పులు వచ్చాకే ఈడీ కోర్టు తీర్పు ఇవ్వాలని ఉన్నత న్యాయ స్థానాలు ఆదేశాలు ఇచ్చాయి. దానికి కారణం అసలు నేరం జరిగిందా?లేదా?ఎవరు తప్పు చేశారు?అన్నది తేలకుండానే ఈడీ రంగప్రవేశం చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నట్లు అవుతుందని చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, ఏపిలో కూటమిపై విపరీతమైన వ్యతిరేకత ఉందన్న అబిప్రాయం నెలకొన్న నేపధ్యంలో చంద్రబాబు ఈడీని ఈ రకంగా ప్రయోగించారేమో అన్నది వైఎస్సార్సీపీ అనుమానంగా ఉంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో సుపారి ఇచ్చారా?లేదా?అన్నది తేలకుండానే ఈడీ హడావుడి చేస్తున్న తీరుపై కూడా సందేహాలు వస్తున్నాయి. అసలు నిందితుల జోలికి వెళ్లకుండా ఎంపీ అవినాష్ రెడ్డికి ,మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంపైన విమర్శలు వస్తున్నాయి. ఈడీ వంటి సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకోవడం అత్యాశ అవుతుందా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


