చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా? | KSR Comment On Chandrababu Government and Yellow Media Fake News | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా?

Oct 14 2026 12:16 PM | Updated on Oct 14 2026 12:35 PM

KSR Comment On Chandrababu Government and Yellow Media Fake News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గత కొద్ది రోజులలో లక్షల కోట్ల  రూపాయల విలువైన కార్యక్రమాలను ప్రకటించింది. వాటన్నిటిని అమలు చేసేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎల్లో మీడియాను ఫాలో అయ్యేవారికి సైతం ఆశ్చర్యం కలిగించేలా ఇందుకు సంబంధించిన కథనాలు కనిపిస్తాయి. ఏడు రోజుల్లో తొమ్మిది కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ మీడియా ఊదరగొట్టింది. సుమారు రెండున్నర లక్షల కోట్లు వ్యయం చేయబోతున్నట్లు ఇవి ప్రచారం చేశాయి. చంద్రబాబు ప్రచారాన్ని, స్పీచ్‌లను  వైఎస్సార్‌సీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిట్టలదొరల మాటలుగా ఎద్దేవ చేశారు. రైతులకు చంద్రబాబు లక్ష మోసాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

బహుశా పిట్టల దొరల మాటలు అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఒక బొమ్మ తుపాకి పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ గప్పాలు కొట్టడం  అన్నమాట. వారు భుక్తి కోసం అలా చేస్తుంటారు. ఓట్ల కోసం చంద్రబాబు అలా పిట్టల దొరలా ప్రసంగాలు చేస్తుంటారని జగన్ విమర్శ. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గాని, లేదా ఇటీవలికాలంలో ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి ,వారిని మభ్య పెట్టడం కోసం గాని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటీవలికాలంలో చంద్రబాబు దాదాపు ప్రతి రోజు హెలికాఫ్టర్‌లో ఏదో ఒక ఊరు వెళుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. 

ఉదాహరణకు పల్లెకు పట్టాభిషేకం, పేదలకు పట్టాభిషేకం, రాయలసీమకు లక్ష కోట్ల ఉద్యాన  హబ్, అమరజీవి జలధార, 2029నాటికి పేదలందరికి ఇళ్లు.. ఇలాంటి ఆకర్షణీయమైన పేర్లతో వేల కోట్ల ప్రోగ్రాంలను ప్రకటించారు. ఇవన్ని కలిపితే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయి. ప్రభుత్వం ఇంత ఆర్ధిక వెసులుబాటుతో ఉందా అన్న సంశయం అందరికి వస్తుంటుంది. ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నెలలో తొమ్మిదివేల కోట్ల అప్పునకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త, కొత్త నినాదాలు, డైలాగులతో ప్రజలను ఏమార్చే పనిలో చంద్రబాబు తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు. 2029 నాటికి పేదలందరికి ఇళ్లు అంటూ చంద్రబాబు బుర్రిపాలెం సభలో చెప్పారు. చిత్రమేమిటంటే పల్లెలలో పేదలకు మూడు సెంట్లు, పట్టణాలలో పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు ఆ ఊసే ఎత్తరు. 

స్థలాల కోసం సుమారు నాలుగన్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. పైగా విజయవాడ,విశాఖలలో సుమారు అరవైవేల   ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినట్లు సభలు పెట్టేశారు. ఒక్క సెంటు స్థలం సేకరించకుండా, ఈ పట్టాభిషేకం ఏమిటా అని విస్తుపోతున్నారు. తీరా చూస్తే అవన్ని ఇప్పటికే పేదలు నివసిస్తున్న ఇళ్లకే ఇచ్చిన పట్టాలట. మరి వీరు కొత్తగా ఇచ్చిన పట్టాలేమిటి అని విపక్షం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆ సభలో ఏకంగా పేదలకు 52వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్లు చెప్పేసుకున్నారు. అదెలాగా అని అంతా బిత్తరపోవాల్సిందే. కాకపోతే ఎల్లో మీడియా పత్రికలలో పతాక శీర్షికలలో ఆ వార్త వచ్చింది కనుక ఆ రోజుకు అది ఉపయోగం అని పాలకులు సంతృప్తి పడుతుంటారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీ కాని, ఎల్లో మీడియాకాని నానా యాగి చేశాయి. 

ఇదీ చదవండి: సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోం

ఇంటి స్థలం పొందిన ఆనందంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఒక వీడియో చేస్తే ,టీడీపీ సోషల్ మీడియా నీచమైన ప్రచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న  విషాద ఘటన జరిగింది. అమరావతిలో పేదలు ఏభైవేల మందికి ఇళ్ల స్థలాలను జగన్ ప్రభుత్వం ఇస్తే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.ఆ పేదల స్థలాలవల్ల అమరావతి పాడవుతుందని కూడా చంద్రబాబు అన్నారు.వీరికి పేదలపై ఉన్న శ్రద్ద ఇదన్నమాట అని వైఎస్సార్‌సీపీ వ్యాఖ్యానించింది. జగన్ టైమ్ లో 20 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా , తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవాటిలో అత్యధిక భాగం నిర్మాణదశలో ఉన్నాయి. ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంకాని, ఇళ్లు నిర్మించడం కాని చేసిన ఏకైక నేత జగన్ అని ఇండిపెండెంట్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయినా ఆ ఘనత జగన్ కు దక్కకూడదన్న అక్కసుతో ఆ ఇళ్లపై దుష్ప్రచారం చేస్తుంటారు. మరోవైపు వాటిలో పూర్తిఅయిన వాటికి ప్రారంభోత్సవం చేస్తూ తామే చేశామని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు.

చిత్రమేమిటంటే రాష్ట్రంలోని టీడీపీ,జనసేన, బిజెపి నేతలు అబద్దాలు చెబుతున్నారంటే రాజకీయం కోసం అలా చేస్తున్నారులే అనుకోవచ్చు.కాని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం అసత్యాలు వల్లె వేశారు.పేదల సొంతింటి కలను జగన్ చెరిపేశారని ఆయన అన్నారట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. కేంద్రమే ఇరవై లక్షల ఇళ్లను నిర్మించడానికి జగన్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తే ,అందులో దాదాపు సగం పూర్తిఅయి ఎదురుగా కనబడుతుంటే చౌహాన్ ఈ మాట అనడం ఏమిటి? అంటే టీడీపీ వారు ఇచ్చిన స్క్రిప్టు చదివి తన పరువు పోగొట్టుకున్నారన్నమాట.  ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్  అమరజీవి జలధార పేరుతో 30వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారట. అయితే గత ప్రభుత్వం చేపట్టిన వివిధ స్కీములను రద్దు చేశారట.రెండేళ్లుగా ఈ పనులు ఎందుకు చేయలేదన్నది కొందరి ప్రశ్న. స్థానిక ఎన్నికలకోసం ఈ హడావుడి అన్నది అర్ధం అవుతూనే ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగమే.

గత ప్రభుత్వం 27వేల కోట్లతో జల్ జీవన్ స్కీమును అమలు చేసింది. వాటిలో కొన్ని దాదాపు పూర్తి అయ్యాయి. ఇదేదో కొత్త పధకం అన్నట్లు పిక్చర్ ఇవ్వడానికి ప్రభుత్వం పాట్లు పడుతోందని వైఎస్సార్‌సీపీ విమర్శ. పట్టణాలలో మౌలిక వసతులకు 11 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. కాని వర్చువల్ గా చేసిన కార్యక్రమంలో  మాత్రం ఏభైవేల కోట్ల పనులు చేస్తామని చెప్పారు. అయితే మున్సిపాల్టీలలో పనులను పిపిపి కింద ప్రైవేటుకు అప్పగించి రుసుములు వసూలు చేసే పద్దతిని తీసుకు వస్తున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మదనపల్లెలో ఒక భారీ సభ పెట్టి లక్ష కోట్ల ప్రపంచ ఉద్యాన కేంద్రం,ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్   అంటూ ఊదరగొట్టారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇస్తుందని చెప్పినా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆ సంగతి వెల్లడించలేదు. 

మిగిలింది ప్రైవేటువారు వ్యయం చేస్తారట. ఇది నమ్మదగిందేనా?ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో ఉద్యానతోటలు ఉన్నాయి. కరువు కారణంగా పలు చోట్ల అవి ఎండుతున్నాయి. ఆ విషయం పై ఆలోచించకుండా కొత్తగా తొమ్మిది లక్షల ఎకరాల పండ్ల తోటలకు లక్ష కోట్లు పెడతామంటే నమ్మశక్యం అనిపిస్తుందా! పల్లెకు పట్టాభిషేకం అంటూ ఇంకో 11వేల కోట్ల పనులు ఆరంభిస్తున్నట్లు మరో సభలో హంగామా చేశారు. ఈ సభలోనే రోడ్డకు కూడా డాక్టర్ లను పెట్టామని, ఎక్కడ రోడ్డుపై గొయ్యి పడినా వెంటనే ఆ డాక్టర్ వెళ్లి పూడ్చుతారని చంద్రబాబు చిత్రమైన ప్రకటన చేశారు.

అది విన్న  పలువురు తమ గ్రామం వద్ద రోడ్ల దుస్థితిని వివరించి వెంటనే డాక్టర్ లను పంపాలని కోరుతుండడం  విశేషం. ఒకసారి ఆర్ధిక పరిస్థితి గట్టెక్కించామని ఆయనే అంటారు. అదే మీటింగ్ లో  ఆస్తులు తాకట్టు  పెట్టి నిధులు సమీకరిస్తున్నామని చెబుతారు. అంటే అప్పులు చేయడం అన్నమాట.సూపర్ సిక్స్ అమలు చేసేశామని అంటారు. అదెక్కడ!ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు నెరవేర్చారా  అని ఎవరైనా అడిగినా ఇచ్చేశామని అనుకో అని డబాయిస్తుంటారు. అందుకే జగన్ వ్యాఖ్యానించినట్లు చంద్రబాబువి పిట్టల దొర మాటలుగానే చూడాలా!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement