అగ్రరాజ్యం అమెరికాతో పాకిస్థాన్‌కు యుద్ధం వస్తే.. భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఈ ప్రశ్న చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. పాకిస్థాన్ విషయంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే భారత్ పాక్‌కు అండగా ఉంటుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలువురు రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లో గురువారం జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మదన్ రాథోడ్ మాట్లాడుతూ.. భారత్ భౌగోళికంగా పాకిస్థాన్‌కు పొరుగున ఉన్న దేశమని పేర్కొన్నారు. అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ పాకిస్థాన్ పక్షాన ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, మన దేశానికి సంబంధించిన అంతర్గత సమస్యల విషయంలో మాత్రం భారత్ పక్షానే నిలబడాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
రాథోడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. భారత సైనికులు, ప్రజలపై దాడులకు పాల్పడే పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే, కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త సందీప్ గుప్తా కూడా రాథోడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అమెరికా-పాకిస్థాన్ యుద్ధం వస్తే పాక్‌కు అండగా ఉంటామని చెప్పడం బీజేపీ వైఖరిని బయటపెట్టిందని ఆయన ఆరోపించారు.
"अगर अमेरिका और पाकिस्तान के बीच युद्ध छिड़ता है, तो हम पाकिस्तान के साथ खड़े होंगे क्योंकि वह हमारा पड़ोसी है।" -राजस्थान बीजेपी अध्यक्ष मदन राठौड़ https://t.co/W4y9oUjLwE
— Mukesh Mathur (@mukesh1275) October 15, 2026
సోషల్ మీడియాలోనూ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం రాథోడ్ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆప్ ఉపాధ్యక్షుడు రామ్ గుప్తా ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడి మాటలను తప్పుబట్టారు. మొత్తంగా, అమెరికా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి.
ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీ.. సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్ దివ్య


