సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, అనుమానిత లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసును విచారించడానికి తమకేమీ అభ్యంతరం లేదన్న సీబీఐ పేర్కొంది. అలాగే, సాయికృష్ణ తల్లి విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం నాలుగు వారాల లోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు.. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించే అంశం కీలకంగా మారింది. విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ నుంచి సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసుల అదుపులో ఉండగానే అతడు మృతి చెంది ఉంటాడన్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కేసును మరింత తీవ్రతరం చేశాయి. అయితే, ఈ కేసులో గతంలో వెలువడిన కీలక పరిణామాలు.. ఇప్పటివరకు జరిగింది ఇదే..
1. మే నెలలో అదృశ్యం
విజయవాడకు చెందిన 25 ఏళ్ల గాదె సాయికృష్ణను మే నెల మొదటి వారంలో మార్కాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, విజయవాడలోని కృష్ణలంక పోలీస్స్టేషన్కు తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
2. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
తన కుమారుడిని పోలీసుల అదుపులో హింసించి చంపి ఉంటారని తల్లి ఆరోపించారు. పోలీస్స్టేషన్లో సాయికృష్ణను చూసినప్పుడు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
3. సీఐ నాగరాజు అరెస్టు
ఈ కేసులో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా పేర్కొనబడ్డారు. ఆయనను సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
4. సీసీటీవీ ఫుటేజీపై అనుమానాలు
మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్స్టేషన్ డీవీఆర్లో సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదని ఫోరెన్సిక్ పరిశీలనలో గుర్తించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఆచూకీ కూడా లభించకపోవడం కేసులో కీలక అంశంగా మారింది.
5. సుప్రీంకోర్టు జోక్యం
2026 సెప్టెంబర్ 23–24 తేదీల్లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని, ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల దర్యాప్తులో లోపాలు, సీనియర్ అధికారుల పాత్రపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. సంబంధిత హైకోర్టు విచారణలను నిలిపివేసి, కేసును తానే పర్యవేక్షించాలని నిర్ణయించింది. అలాగే, సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమర్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


