స్థానిక సంస్థల ఎన్నికల వేళ కర్నూలు జిల్లా ఆదోని, కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవుల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పొత్తు సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికతో జనసేన నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదోనిలో జనసేనకు కేటాయించే స్థానాల సంఖ్య తగ్గినట్లు ప్రచారం జరుగుతుండగా.. తునిలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన మీనాక్షికి చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది.
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్మన్ పదవిపై కొత్త చర్చ మొదలైంది. తొలుత జనసేనకు 23 స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో చైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వెల్లడైనట్లు చెబుతున్న టీడీపీ జాబితాలో జనసేనకు 21 స్థానాలే కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ఖంగుతిన్నారు. దీంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్థానాల కేటాయింపులో మార్పుతో ఆదోని జనసేన నాయకులు నిరాశకు గురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే చైర్మన్ పదవిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తునిలో టీడీపీ నుంచి జనసేనలోకి..
మరోవైపు కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలోనూ చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది. తుని మున్సిపాలిటీ టీడీపీకి కేటాయిస్తే మాజీ కౌన్సిలర్ మల్లా గణేష్ భార్య మీనాక్షి పేరును ప్రకటించాలని ఎమ్మెల్యే యనమల దివ్య భావించినట్లు సమాచారం. అయితే పొత్తులో భాగంగా తుని మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీనాక్షి రాత్రి టీడీపీ నుంచి జనసేనలో చేరినట్లు సమాచారం. అనంతరం యనమల కృష్ణుడు ఆమెను జనసేన చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యనమల కృష్ణుడు సైతం సుమారు 20 రోజుల క్రితమే జనసేనలో చేరడం గమనార్హం.
ఈ పరిణామాలపై తుని జనసేన సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, పొత్తు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం స్థానికంగా చర్చకు దారితీసింది. ఆదోనిలో స్థానాల కేటాయింపు మార్పులు.. తునిలో టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన నేతకు చైర్మన్ అభ్యర్థిగా అవకాశం.. ఈ రెండు పరిణామాలతో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కాయి.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలు.. నామినేషన్ దాఖలుకు ఏమేమి ఉండాలి?


