సాక్షి, న్యూఢిల్లీ: ఎల్నినో (El Nino) ముప్పు, తగ్గుతున్న వరి సాగు విస్తీర్ణం, పెరుగుతున్న దేశీయ ధరలు ఎగుమతి సరఫరాలకు ముప్పుగా పరిణమించడంతో, 2027లో ప్రపంచ బియ్యం మార్కెట్లో భారతదేశ ఆధిపత్యానికి పరీక్ష ఎదురుకావచ్చు. ఎల్నినో కారణంగా రుతుపవనాల అనిశ్చితితో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దేశ బియ్యం ఎగుమతులు 4 శాతం తగ్గి 24 మిలియన్ టన్నులకు పడిపోతాయని యూఎస్డీఏ అంచనా వేస్తోంది.
ఎల్నినో ప్రభావంతో దేశంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు బియ్యం ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్లో వరి సాగు విస్తీర్ణం గత సీజన్తో పోలిస్తే 3.7 శాతం తగ్గి, 4.292 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 4.6 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 4.3 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 1.8 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 1.5 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 2025–26లో దేశం నుంచి 15.4 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి జరగ్గా, ఈ సీజన్లో ఉత్పత్తి 4.5 శాతం మేర తగ్గి 14.7 కోట్ల టన్నులకు పరిమితం కావచ్చని అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: జియో అలా పుట్టింది : ఇషా అంబానీ చెప్పిన ఇంట్రస్టింగ్ స్టోరీ
వరి సాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని రకాల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే సోనా మసూరి, పొన్ని, స్వర్ణ రకాల ధరలు 10 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. దేశీయంగా ధరలు పెరిగితే విదేశీ కొనుగోలుదారులకు బియ్యం మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.


