యూపీ ఎన్నికలపై అఖిలేష్‌ జోస్యం, ఈసీపై సంచలన వ్యాఖ్యలు | Akhilesh Yadav level serious allegations on electoral roll in UP | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికలపై అఖిలేష్‌ జోస్యం, ఈసీపై సంచలన వ్యాఖ్యలు

Oct 16 2026 1:20 PM | Updated on Oct 16 2026 1:31 PM

Akhilesh Yadav level serious allegations on electoral roll in UP

లక్నో,సాక్షి :  ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై పలు   తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలోని అవకతవకలు, ప్రతిపక్ష ఓటర్ల పేర్లను తొలగించడం, నకిలీ ఓట్లను చేర్చడం వంటి విషయాలపై ఆయన ఎస్పీ కార్యకర్తలను హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈసారి ఈ కుంభకోణాన్ని బయటపెడతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పీడీఏ, ముస్లిం-యాదవ్ ఓటర్లు, యువ ఓటర్ల మద్దతుతో ఎస్పీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలోని అవకతవకల వల్ల ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఓట్లు నమోద య్యాయని యూపీ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఒక వ్యక్తి ఒక ఓటు వేస్తే, బీజేపీ తొమ్మిది ఓట్లు వేస్తుందంటూ వ్యంగ్యంగా అన్నారు.

ఇదీ చదవండి:కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
వికాస్ యాదవ్, శంభు శంకర్ శర్మల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన ఓటర్ల జాబితాపై ప్రశ్నలు లేవనెత్తారు. తమ పార్టీ 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిర్యాదులు దాఖలు చేసిందని అఖిలేష్ తెలిపారు. తమ శ్రేణుల ఓట్లను చేర్చేలా చూడాలని, ఎవరి పేరునూ తప్పుగా తొలగించకుండా చూడాలని ఆయన ఎస్పీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈసీఐ ప్రత్యేక పునశ్చరణ శిబిరం సందర్భంగా అక్టోబర్ 17, 24 తేదీలు కీలకమైనవని ఆయన అభివర్ణించారు. బీజేపీ, ఈసీ ఎన్ని పన్నాగాలు పన్నినా  పీడీఏ (పిచ్‌డా, దళిత, అల్పసంఖ్యాక), ముస్లిం-యాదవ్‌ ఓటర్లు, జెన్‌ జెడ్‌ వర్గాల కలయికతో ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.  

అలాగే ఈసీకి వ్యతిరేక ఆందోళనల పట్ల  కేంద్రం వ్యవహరిస్తున్న తీరును  అఖిలేష్‌ యాదవ్‌ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. ఢిల్లీలో నిరసనకారులపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధారణ దుస్తుల్లోని వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వారు బీజేపీ భావజాలంతో సంబంధం కలిగి ఉన్నందువల్లే అరెస్టు చేయలేదని ఆరోపించారు. సాధారణ ప్రజలపైకి రాజకీయ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. జర్మనీలో నాజీ హిట్లర్‌ కూడా ఇలాగే చేసేవాడని పేర్కొన్నారు. దేశానికి బీజేపీయే ఒక సంక్షోభం అని మండిపడ్డారు. ఈ సంక్షోభాన్ని తొలగిస్తేనే దేశం బాగుపడుతుందని మండిపడ్డారు.  రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్‌మెంట్‌

కాగా ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది  జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని అఖిలేష్‌ యాదవ్‌ కసరత్తు   చేస్తున్నారు. ఇందులో  భాగంగానే బీజేపీ వ్యతిరేక  శక్తులను కూడగట్టి, కూటమిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement