గాంధీ నగర్: భారత మాజీ క్రికెటర్,పశ్చిమ బెంగాల్ నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) పార్టీ ఎంపీ యూసఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం నుంచి ఊహించని రీతిలో భారీ ఊరట లభించింది. గుజరాత్ వడోదర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు పదేళ్లుగా నలుగుతున్న వివాదాస్పద భూ కేటాయింపుల వ్యవహారానికి ఎండ్‌కార్డ్ పడినట్లు తెలుస్తోంది. దీంతో చట్టపరమైన ఇబ్బందుల నుంచి అనూహ్యంగా బయటపడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
యూసఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్ బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు.అయితే, ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనకు బ్రేకులు పడ్డాయి. ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో టీఎంసీలో అంతర్గత విభేదాలు బయపడ్డాయి.దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు (యూసఫ్ పఠాన్‌తో సహా) దీదీ నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకు, అప్పట్లో పెద్దగా ప్రాచుర్యం లేని ఎన్‌సీపీఐ అనే ప్రాంతీయ పార్టీలో టీఎంసీ రెబల్ ఎంపీలు విలీనమయ్యారు. తదనంతరం లోక్‌సభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో నామమాత్రంగా ఉన్న ఆ చిన్న పార్టీ ఒక్కసారిగా లోక్‌సభలో బలమైన కూటమిగా మారి పార్లమెంట్‌లో ఐదవ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.
ఈ క్రమంలో నానుతూ వస్తున్న యూసఫ్ పఠాన్ భూవివాదం కేసు తెరపైకి వచ్చింది.వడోదరలోని తందల్జా వంటి ప్రైమ్ ఏరియాలోయూసఫ్ పఠాన్ నివాసం ఉంటున్న భవనం పక్కనే 978 చదరపు మీటర్ల స్థలం ఉంది. 2012లో అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్న సమయంలో తన భద్రతా కారణాలరీత్యా ఈ స్థలాన్ని తనకు కేటాయించాలని పఠాన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అధికారికంగా ఎలాంటి కేటాయింపుల ఉత్తర్వులు రాకముందే ఆయన ఆ స్థలాన్ని తన బంగ్లాలో కలుపుకొని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం, దీనిపై న్యాయపోరాటం జరగడం చకచకా జరిగిపోయాయి.
కోర్టులో ఎదురుదెబ్బలు.. ఆపై ఊహించని మలుపు
ఈ వివాదంపై గుజరాత్ హైకోర్టులో జరిగిన విచారణల్లో యూసఫ్ పఠాన్‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించుకున్నారంటూ న్యాయస్థానం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులోనూ ఆయనకు ప్రతికూల వాతావరణమే కనిపించింది.
కానీ, అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు మారిన తరుణంలో గుజరాత్ సర్కార్ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 20.5 కోట్ల విలువైన ఆ భూమిలో 500 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రత్యేక విధానం కింద కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడాన్ని గమనించిన యూసఫ్ పఠాన్.. గతంలో కోర్టులో తాను వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం వీఎంసీ స్టాండింగ్ కమిటీ, జనరల్ బోర్డు ఆమోదం తర్వాత ఈ భూ ప్రక్రియ పూర్తిగా లాంఛనం కానుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఒక హైప్రొఫైల్ లీగల్ డ్రామాకు ఈ రూపంలో తెరపడటం క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


