వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం.. తనపై తనకు ఎంత నమ్మకం.. లేకుంటే ఎమ్మెల్యేల టిక్కెట్లకు సంబంధించి అంత పెద్ద ప్రకటన చేస్తారా?. ప్రత్యర్ది పార్టీ విసురుతున్న సవాలుకు ధీటుగా వ్యూహరచన చేయడంలో మొనగాడినని సీఎం జగన్ రుజువు చేసుకుంటున్నారు. ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేకపోవచ్చన్న ప్రకటన, మరో వైపు అవినీతి కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంపై వచ్చిన విశ్లేషణల్లో అధిక భాగం ఆయన డేర్‌నెస్ గురించి మెచ్చుకున్నవే. ఇందులో కొంత రిస్కు ఉంటుందని తెలిసినా ఆయన నిక్కచ్చిగా మాట్లాడిన తీరు ఆసక్తికరమైనది. నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతున్నాయని, అందులో ప్రజల ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే అభ్యర్దుల ఎంపిక జరుగుతుందని, ఎవరైనా కొందరికి పార్టీ టిక్కెట్లు ఇవ్వలేకపోయినా, వారు తనవారేనని, వారికి వేరే పదవులు ఇస్తామని చెప్పడం విశేషం. సాధారణంగా ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇలాంటి ప్రకటనలు చేయడానికి సాహసం ఉండాలి. ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికలలో వారికి టిక్కెట్లు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పారు. వారు పార్టీని వీడి ప్రత్యర్ధి గూటిలో చేరతారని తెలిసినా, ఒక్క ఓటు తేడాతో ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోయే అవకాశం ఉందని తెలిసినా, ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు.
✍️ దాంతో వారు ఇద్దరు, అప్పటికే పార్టీపై తిరుగుబాటు చేసిన మరో ఇద్దరు టీడీపీ అభ్యర్దికి ఓటు వేసినా ఆయన చలించలేదు. అందువల్ల జరిగే నష్టాన్ని భరించడానికే సిద్దపడ్డారు తప్ప, వారిని ఏదో రకంగా మేనేజ్ చేయాలని ఆయన తలపోయలేదు. రాజకీయాల్లో ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీ రాజకీయాలలో ఇలా చేయడానికి ఎంతో స్థైర్యం ఉండాలి. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి చివరి క్షణం వరకు వారిని బుజ్జగిస్తున్నట్లు వ్యవహరించలేదు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. అది ఆయనకు బలం.. అలాగే బలహీనత కూడా అని విశ్లేషించుకోవచ్చు. ఆయన ఒకసారి మాట అంటే తొంభై తొమ్మిది శాతం వెనక్కి తగ్గరన్న అభిప్రాయానికి ఆయా నేతలు వచ్చి, ఆయనతో సర్దుకు పోవడానికి మానసికంగా సిద్దపడతారు. కార్యకర్తల్లో విశ్వాసం ఏర్పడుతుంది. బలహీనత ఏమిటంటే రాజకీయాలలో ఉన్నది ఉన్నట్లు చెబితే అది ఒక్కోసారి నష్టం కలగవచ్చు.
✍️ తాజాగా సీఎం జగన్ చేసిన ప్రసంగంలో రెండు, మూడు అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. వై నాట్ 175 అంటూ కొత్త నినాదం చేసి పార్టీలో జోష్ పెంచిన ఆయన ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ అన్న కార్యక్రమం చేపడుతున్నారు. అంటే మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రజలకు వివరించాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రచారం చేయాలని ఆయన సూచిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో చేపడుతున్న స్కీంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద ఈ స్కీమ్ ద్వారా బాగా తెలుస్తుంది. ప్రతీ ఒక్కరి ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నవారు వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం, అవసరమైనవారికి మందులు, చికిత్సలకు ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
✍️ సహజంగానే ఈ కార్యక్రమం అమలు చేయడంవల్ల ప్రజలలో ప్రభుత్వం అభిమానం బాగా పెరుగుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం జగన్ ఈ స్కీంను తన ప్లాగ్ షిప్ స్కీంగా భావిస్తున్నారని అనుకోవచ్చు. తన స్కీంల ద్వారా ఆయన రాష్ట్రంలో ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. గత స్థానిక ఎన్నికలలో తొంభై శాతం పైగా సీట్లు వైఎస్సార్‌సీపీకి సాధించారంటే అందుకు ఓటు బ్యాంకు ఏర్పడటం కూడా కారణమని చెప్పాలి. ఆయన అడ్రస్ చేసే సభలలో వచ్చే స్పందన గమనిస్తే ఆయన నాయకత్వంపై ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పట్ల సానుకూలత ఉన్నా, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉంది. సహజంగానే ఏ అధికార పార్టీకైనా ఈ సమస్య ఉంటుంది. దానిని అధిగమించడానికి కొంత టైమ్ ఇస్తుంటారు. అయినా పెద్ద మార్పు లేకపోతే, సర్వేల ప్రాతిపదికన మరొకరికి టిక్కెట్ ఇస్తారు. అదే విషయాన్ని సీఎం జగన్ చెప్పడంతో ఆయా ఎమ్మెల్యేలు తిరిగి టిక్కెట్ పొందడానికి వీలుగా బాగా కష్టపడే అవకాశం ఉంటుంది.
అయితే, అదే టైమ్‌లో కొన్ని చోట్ల ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించే వారు వీరిని బద్నాం చేయడానికి కూడా యత్నించవచ్చు. వాటిని కంట్రోల్ చేయడానికి పార్టీ అధిష్టానం కృషి చేయవలసి ఉంటుంది. కాగా జగన్ అన్ని స్కీములను, నగదు ప్రయోజనాలను నేరుగా ప్రజలకే అందేలా చేస్తుండంపై కేడర్‌లో కొంత అసంతృప్తి ఉందన్న భావన ప్రచారం అవుతోంది. దీనివల్ల తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, తమ వద్దకు ఎవరూ రావడం లేదన్నది కొంతమంది అభిప్రాయం. నిజానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేడర్‌కు వివిధ రకాల పదవులు పెద్ద ఎత్తున ఇవ్వడంలో పార్టీ నాయకత్వం సఫలం అయింది. గతంలో జన్మభూమి కమిటీల పెత్తనం చూసిన కొంతమంది తమకు కూడా అలాంటి అవకాశం ఉండాలని ఆశిస్తుంటారు. కానీ, దాని వల్ల టీడీపీ ఎంతగా నష్టపోయింది అందరికి తెలుసు. అందువల్ల ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్తపడుతూ స్కీముల అమలులో కులం, ప్రాంతం, పార్టీ తేడాలు లేకుండా అవినీతి రహితంగా అమలు చేస్తోంది.
అందువల్లే సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలలో ముఖ్యంగా పేదవర్గాలలో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఈ కారణంగా అక్కడక్కడా అసంతృప్తి కార్యకర్తలలో ఉందని చెబుతున్నా, అది సర్దుకుపోతుంది. జగన్ ఒక్కసారి ప్రచార యుద్దంలో దిగితే ఇవన్ని క్లియర్ అయిపోతాయి. వచ్చే ఎన్నిక ప్రధానంగా సీఎం జగన్ కేంద్రంగానే జరగబోతోంది. అయినా, ఎమ్మెల్యే అభ్యర్దులు కూడా కీలకం కనుక జగన్ సర్వేల ఆధారంగా టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక టీడీపీ ఎజెండాను దెబ్బతీయడంలో సీఎం జగన్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంతకాలం టీడీపీ పత్రికలు, టీవీలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వస్తున్నాయి. అలాగే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ.. తరచు ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా తమను ఏమీ చేయలేరని సవాల్ విసిరారు.
దానికి జవాబుగా ఆయన వారిపై ఉన్న కేసులను ఒక కొలిక్కి తెప్పించారు. సీఐడీ వారు చంద్రబాబును అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి జగన్ మగాడురా! హీరోరా! అన్న అభిప్రాయం ప్రజలలో తేగలిగారు. లోకేష్ అయితే ఏకంగా ఢిల్లీకి చిత్తగించి ఏపీకి రావడానికి భయపడుతున్నారు. టీడీపీ మీడియా అంతా ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేయలేదని ప్రజలకు చెప్పడానికి నానా పాట్లు పడుతున్నాయి. ఫలితంగా వారి విషపూరిత ఎజెండాకు ఆటంకం ఏర్పడింది. ఆ బాధను వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎన్నికల ముందు తమపై ఇక కేసులు రావులే అనుకున్న చంద్రబాబుకు ఆయన పెద్ద షాకే ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు, లోకేష్ ఢిల్లీలోనే మకాం చేయడం ద్వారా ప్రతిపక్ష టీడీపీ కేడర్‌లో ఆత్మ విశ్వాసం సడలిందని చెప్పాలి. ఒకవైపు తన పార్టీని అదుపులో ఉంచుకుని కొత్త జోష్ నింపడం, మరో వైపు ప్రత్యర్ధి అయిన టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీయడం జగన్ వ్యూహచతురతగా భావిస్తున్నారు.

కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్


