ఆంధ్రప్రదేశ్‌లో జూదాల జాతర! రెండు వేల కోట్ల పందాలు! మందు బాబులకు పండగే! మూడు రోజుల్లో 438 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! గోవా నుంచి క్లబ్ డాన్సర్లు! అశ్లీల నృత్యాలు! కాసినోలు, గుండాట! ఇలాంటి శీర్షికలతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఏమనుకోవాలి? రాష్ట్రం ముందుకెళుతోందనా? లేక దిగజారిపోతోందనా?.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, వినోదమని ప్రచారం చేసుకోవడం, పరోక్షంగా సమర్థిస్తూండటం చూసి ప్రముఖ సామాజికవేత్త సునీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు.. పరిస్థితి ఎంత నీచంగా ఉందో చెబుతున్నాయి.
‘ఏపీలో పలుచోట్ల రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే, సమాజం దానిని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి" అని సునీత కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్తకు తీసుకువెళ్లింది.. అనేది సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది.
హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్ధ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తున్న చంద్రబాబు, సనాతని వేషం కట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్‌బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేశ్‌లకు ఏపీలో సంక్రాంతి పండుగ పూట మూడు రోజులపాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు.. ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా?..
వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ కేసులు పెట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ మూడు రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు, వాటికి రక్షణగా నిలబడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టు ఒకరు ఈ వికృతాలను వివరిస్తూ ఉయ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి, గోవా నుంచి డాన్సర్లను అందుబాటులో ఉంచారని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంటిచోట్ల కళ్లెదుటే క్యాంపులు కనిపించినా పోలీసులు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు క్లబ్ డాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు వేస్తే, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వాటిని పండగ, సంబరమంటూ ప్రొజెక్టు చేసింది. పందాలు అనేవి నిషేధం. ఏపీలో పందాల వార్తలు, ఎవరు ఎంత పందెం కాసిందీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి?..
ఎల్లో మీడియా అంచనా ప్రకారమే ఈ పందాల విలువ రూ.2,000 కోట్లు. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఓ ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలలోనే రూ.500 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.800 కోట్ల పందాలు జరిగాయట. బాపట్లలో రూ.200 కోట్ల కోడిపందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందంలో రూ.1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే, మరో వ్యక్తి దానిని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పలేం. మొబైల్ వాన్లు తిప్పి మరీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్ట సమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటిని అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి కోడిపందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికి తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసింది. ఈసారి అంతకుమించి సెటప్‌లు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా వీటిని పర్యవేక్షించినా ఈ ఎల్లో మీడియాకు సంబరంగా కనిపించింది. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసులకు బాగా గిట్టుబాటైందని వార్తలు వచ్చాయి.
జూదం, పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగిపోతుంటే, వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్ గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాలలో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి.. ఎంత తెలివో!..
ఒకపక్క అశ్లీల న్యత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జూద పందాలతో ప్రజలు ఆర్ధికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా.. ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీక్ ఇచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జూద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసిచూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపధ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసింది. అశ్లీల నృత్యాల హోరులో బ్రాండ్ ఇమేజీ కొట్టుకు పోయింది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


