బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్‌ ఇదేనా?

Kommineni Srinivasa Rao Article on Chandrababu Use And Throw Politics - Sakshi

మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నెపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన యత్నం ఇంతా, అంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే, గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో, లేదో అన్న సందేహం ఉండేది. స్వయంగా కోడెల కుమారుడు శివరామ్ చెబుతున్నారు.

ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట..
రాజమండ్రి మహానాడులో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం సరికదా! ఆయన భార్యకు, కొడుకుకు కనీస గౌరవం దక్కలేదట. పుండుమీద కారం చల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ
మరో వైపు నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయం మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదలించుకోవాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు. దాంతో ఆయన కలత చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్లలేదని అంటారు. ఫలితంగా కోడెల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా ?లేదా? అన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

శవయాత్రకు ప్లాన్..
కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్లారు. ఆయా చోట్ల కాని, స్మశానంలో కాని ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కనపెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా కాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికి అర్దం అయింది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరామ్ సత్తెనపల్లి లో రాజకీయాలు చేయడం ఆరంభించారు. కాని అందుకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా ఆ నియోజకవర్గంలో రెండు,మూడు గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి.

ఆ విషయం శివరామ్‌తో చెప్పించారట..
ఈ క్రమంలో సడన్‌గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరామ్ తీవ్రంగా స్పందించారు. అప్పుడు కాని కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి, తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదని ఇప్పుడు వెల్లడైంది. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరపవద్దని శివరామ్‌తో చెప్పించారట. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి.

నమ్ముకున్న కుటుంబాన్ని నట్టేట ముంచేశారు..
కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరామ్ ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కాని, చంద్రబాబుపై కన్నా తీవ్ర విమర్శలే.. కాదు.. కాదు.. దూషణలే చేసేశారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును పట్టుకుని వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీకుదిరిందో కాని కన్నా సడన్‌గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తనను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట.

ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో..
శివరామ్‌తో పాటు మరికొందరు సత్తెనపల్లి టీడీపీ నేతలకు కూడా కన్నాను అభ్యర్ధి చేయడంపై జీర్ణించుకోలేకపోయినా,వారు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చంద్రబాబు ఎందుకు శివరామ్‌ను బలి చేయడానికి వెనుకాడలేదన్న చర్చ సహజంగానే వస్తుంది. శివరామ్ సత్తెనపల్లిలో గెలవలేడన్న అభిప్రాయానికి వచ్చి ఉండాలి. లేదా శివరామ్‌కు సత్తెనపల్లిలో మంచి పేరు లేదన్న భావన అయినా కావాలి. లేదూ కోడెల వల్ల అప్పట్లో పార్టీకి నష్టం కలిగిందని అనుకుని ఉండవచ్చు. కాకపోతే కోడెల చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో ఆయన మృతిని వాడుకున్నారన్నమాట.
చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే!

నిజానికి కన్నాపై చంద్రబాబు కూడా గతంలో చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అసెంబ్లీలో తిట్టుకున్నంత పనిచేశారు. అయినా రాజకీయం మారింది. ఇద్దరూ తమ తిట్లను తూచ్ అనుకున్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్నదానికి ఇదొక ఉదాహరణ కూడా కావచ్చు. కన్నా నిజానికి జనసేన పార్టీలో చేరవచ్చని అంతా అనుకున్నారు. ఆ మేరకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు కూడా జరిగాయి. కన్నా కాపు సామాజికవర్గంలో కొంత గుర్తింపు పొందిన సీనియర్ నేత కనుక ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగు అయితే పొత్తు సమయంలో ఎక్కువ సీట్లు అడుగుతారని చంద్రబాబు ఊహించి ఉండవచ్చు.

అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసింది..
అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసి జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒక దెబ్బేశారన్నమాట. అయినా పవన్ పెద్దగా పీల్ అవరు కాబట్టి ఆయన చంద్రబాబు చొక్కా పట్టుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంలో పొత్తు లేనప్పుడు పవన్ను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆయన సీఎం పదవి డిమాండ్ చేయకుండా తోక కట్ చేయగలిగారని అనుకోవాలి. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా?లేదా?అన్నది సంశయమే.

టీడీపీకి గుండెలో రాయి పడినట్లే..
ఇప్పటికే శివరామ్ తాను సత్తెనపల్లిలో పోటీచేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీలో దిగితే కన్నా కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇస్తే ఏమిటి అని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇబ్బందిలో పెట్టారు. ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యులలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ,అంటనట్లు ఉంటున్నారు. కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పిట్టలదొరకు ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నానీ సోదరుడు చిన్నీకి టిక్కెట్ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారన్నమాట. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయి పడినట్లే అవుతుంది.
చదవండి: కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..!

కాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూపు సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్లివచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీసు ఇచ్చింది. అసలే నంద్యాల, కర్నూలు జిల్లాలలో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటుంటే, ఈ గొడవలతో మరింత అప్రతిష్టపాలవుతోంది. మరో వైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫౌండేషన్‌ల పేరుతో కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే వారికి టీడీపీ టిక్కెట్లు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు వైసీపీలో జరిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టిడిపిలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలని అనుకున్న టీడీపీకి, చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top