సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్‌తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.
సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్‌సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


