కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావు: కేసీఆర్‌ | KCR Speech At BRS Praja Ashirvada Sabha In Sangareddy - Sakshi
Sakshi News home page

సంగారెడ్డి మీటింగ్‌: కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా రావు: కేసీఆర్‌

Published Tue, Apr 16 2024 7:39 PM

Kcr Speech At Sangareddy Parliament Election Praja Asirvadha Sabha - Sakshi

సంగారెడ్డి,సాక్షి: రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్‌ గాళ్లకు అధికారం వస్తుందని,  పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లిపుట్‌ గాళ్లకు సురుకు పెట్టినట్లతవుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(ఏప్రిల్‌ 16) జరిగిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 

‘ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో వణుకుతున్నాడు. కాంగ్రెస్‌ పనైపోయింది. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంపైతడా తెల్వదు. ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగేలా.. నన్ను పెంచింది మెతుకు సీమ. మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిచ్చిన మెతుకుసీమ గడ్డ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కొంత మంది బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ సీట్లు ఎందుకని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్‌ఎస్‌కు. బీఆర్‌ఎస్‌ బిడ్డలు పార్లమెంట్‌లో ఉంటేనే మన హక్కులు నెరవేర్తాయి.

రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు ఉంటుంది.  గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంత మంది లిల్లిపుట్‌ గాళ్లకు కూడా అధికారం వస్తుంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు 125 ఫీట్ల అంబేద్కర్‌ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించుకున్నాం. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసింది.  పూలమాల పెట్టలే.. ఏర్పాట్లు చేయలే.. సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్‌ చేశారు.

ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్‌లో ఎందుకు కూర్చుకుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్‌ అని పేరు పెట్టాం కదా.. యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు..ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు. అవన్నీ మేమే కట్టాం. ఇదే లిల్లీపుట్‌ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్‌కు ఇవ్వలే. మనం సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్‌లు పెట్టుకున్నం. వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకుంట లేదు.

దళితబంధు బంద్‌ పెడితే నోరు మూస్కోని పడుందామా.. అంబేద్కర్‌ను అవమానిస్తే చూస్తూ ఊరుకుందామా. వీళ్లకు సురుకు పెట్టాలె. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందే. ఉద్యోగులకు ఎన్నో ఇచ్చాం గుర్తులేదా.. ఆలోచించండి లేదంటే బీఆర్‌ఎస్‌కు ఏం కాదు.. మీరే నష్టపోతరు. కరెంటు ఉండాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలి.

డీజీపీ వార్నింగ్‌.. 

పోలీసులు మీకు రాజకీయాలెందుకు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. కరీంనగర్‌లో సల్వాజీ మాధవరావు అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. డీజీపీకి వార్నింగ్‌ ఇస్తున్నా.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. మీరేం చేస్తున్నరో అన్నీ రికార్డు చేస్తున్నం. జాగ్రత్త’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement