కూటమి సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి | Kakani Govardhan Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి

Dec 2 2025 10:11 PM | Updated on Dec 2 2025 10:16 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu Government

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్‌ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్‌సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:

అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్‌ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.

రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్‌ మాఫియా:
రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్‌ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్‌ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:
పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్‌ఆర్‌సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.

చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.

టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:
బంద్‌కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్‌ 2న నెల్లూరు బంద్‌కు టీడీపీ, వైయస్‌ఆర్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్‌ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే  పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.

పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:
టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియాపై కఠిన చర్యలు లేవు.

ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:
పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి  (మంగళవారం) బంద్‌ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement