● 22 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్)/నెల్లూరు(పొగతోట): గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న పలు హోటళ్లు, క్యాటరింగ్ సెంటర్లలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయీస్ అధికారుల తనిఖీలు ఆదివారం కూడా కొనసాగాయి. సబ్సిడీపై అందజేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.51,250ల విలువైన వివిధ కంపెనీలకు చెందిన 22 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ లీలారాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశామన్నారు. సబ్సిడీపై అందజేసే గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నేరమన్నారు. నగరంలోని కృష్ణా గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసి సకాలంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు రోజుల్లో 21 మందిపై కేసులు నమోదు చేసి, 141 సిలిండర్లను సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీల వద్ద భద్రపరిచామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్
నెల్లూరు(టౌన్): వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు. దీనికి 1,00,528 మందికి గానూ 1,00,115 మంది హాజరయ్యారు. వారికి 100 గంటలపాటు శిక్షణా తరగతులు జరిపి టెస్ట్ నిర్వహించినట్లు వయోజన విద్యాశాఖ అక్షరాంధ్ర నోడల్ ఆఫీసర్ మస్తాన్‌రెడ్డి తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు, విద్యాశాఖాధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొని విజయవంతం చేసినట్లు వెల్లడించారు.
ప్రాణం తీసిన ఈత సరదా
పొదలకూరు: మండలంలోని మరుపూరు ఎస్టీ కాలనీలో ఉంటున్న వెందోటి ప్రదీప్ (14) ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. నరసింహులుకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమై ంది. కుమారుడు ప్రదీప్ తండ్రి వద్దే ఉంటున్నాడు. అతను నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద ఉన్న పాత బావిలో సరదాగా ఈత కు వెళ్లాడు. ఈ క్రమంలో మునిగిపోవడంతో మిగిలిన వారు గ్రామంలో చెప్పగా పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీటిని తోడి ప్రదీప్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేశారు.


