దారంతో వివిధ రకాల చిత్రాలు
● మర్రిపాడు మండల వాసి ప్రతిభ
● ఎన్నో అవార్డులు సొంతం
వేంకటేశ్వర స్వామి చిత్రం
ఆత్మకూరు: ఆ మాస్టార్ దారం పట్టుకుంటే అద్భుత చిత్రాలు తయారవుతాయి. దేవుళ్లు, రాజుల చిత్రాలను దారంతో తయారు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటికే ఆ కళను గుర్తించిన ‘అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ వారు అవార్డు అందజేశారు. పలువురు సినీనటులు అవార్డులు అందజేసిన సందర్భాలున్నాయి.
ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం బూదవాడకు చెందిన మున్నెళ్లి శివశంకర్ అనంతసాగరం మండలం చిలకలమర్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే వందలాది దారపు చిత్రాలు తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం, హనుమాన్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి తదితర సందర్భాల్లో దారపు చిత్రాలను తయారు చేయడం శివశంకర్ ప్రత్యేకత. ఇలా చిత్రాలు రూపొందించే కళ జిల్లాలో మరెవరికీ లేకపోవడం గమనార్హం. ఈయన కళను గుర్తించిన అమెరికన్ విజ్‌డమ్ పీస్ అకాడమీ – బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు గత నెల 28న అవార్డును ప్రకటించి తమిళనాడులోని హోసూరులో ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో సృజనాత్మక కళను ప్రదర్శించి గుర్తింపు పొందిన వారికి ఈ సంస్థ అవార్డులు అందస్తుంది.
ఎక్కడా చూడలేదు
గతేడాది నెల్లూరుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ శివశంకర్ తయారు చేసిన చిత్రాలను చూసి అభినందించారు. ఈ కళ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దారపు చిత్రకళ తాను ఎక్కడా చూడలేదని బాబుమోహన్ అన్నారు. దారం ఎక్కడ ప్రారంభించారో, చిత్రం పూర్తయ్యి తిరిగి అక్కడే అంతమయ్యేలా రూపొందించడం అభినందనీయమని కొనియాడారు.
అదృష్టంగా భావిస్తున్నా
అరుదైన ఈ కళ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆసక్తి గల వారికి నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నా.
– శివశంకర్


