
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కూడా టికెట్‌ను పార్టీ లోకల్ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో..
గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ల పేర్లు కాంగ్రెస్ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే..
తాజాగా కాంగ్రెస్ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిశారు. కేబినెట్‌లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్‌ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది.
ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌లు సీఎం రేవంత్‌తో చర్చిస్తున్నారు.
బీఆర్‌ఎస్ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.
ఇదీ చదవండి: హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం