అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..

Janasena Chief Pawan Kalyan Planning To Alliance With TDP - Sakshi

తెలుగుదేశం, జనసేనలు కలిసి పనిచేయడానికి అడుగు ముందుకు పడింది. ఊహించిన విధంగానే ఈ వ్యవహారం సాగుతున్నా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం వద్ద పెట్టడానికి సిద్ధం అయినట్లు అనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తెలివైన వారేనని అంగీకరించాలి. తాను త్యాగం చేయడానికి సిద్ధంగా లేనని, ఎప్పుడూ మేమే త్యాగం చేయాలా అన్న పవన్ కల్యాణ్‌ను తన దారిలోకి తెచ్చుకున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయన ఇగో సాటిస్పై చేసినట్లు కనిపించారు.
చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్‌ కల్యాణ్‌కు అర్థమవుతుందా?

అసలు ఆట తన చేతిలోకి వస్తున్నప్పుడు ఇలా తగ్గితే తనకు పోయేదేముందిలే అని భావన చంద్రబాబుకు ఉండవచ్చు. 2014లో కూడా పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన  ఘట్టం గుర్తుకు చేసుకుంటే, ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయినట్లు ఉంది. కాకపోతే 2014లో పవన్ కల్యాణ్‌ అసలు పోటీలోనే లేకుండా టీడీపీ, చంద్రబాబు సేవలో తరించారు. ఆనాటి పరిస్థితులు వారికి కలిసి వచ్చాయి. తదుపరి పవన్ కల్యాణ్‌ను కరివేపాకు మాదిరి పక్కనబెట్టేశారు. కాకపోతే అప్పడప్పుడు ప్రత్యేక విమానాలలో రప్పించుకుని మాట్లాడి పంపిస్తుండేవారు. ఇదే ప్యాకేజీ స్టార్ అన్న విమర్శకు ఆస్కారం ఇచ్చింది.

ఒకసారి అమరావతి రాజధాని రైతుల భూముల సమీకరణ విషయంలో ఏర్పడిన వివాదంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లి రైతుల తరపున పెద్ద స్పీచ్ ఇచ్చారు. తదుపరి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబును కలవగానే మొత్తం మారిపోయారని అంటారు. ఆ తర్వాత కొంతకాలం టీడీపీకి దూరం అయినట్లే అనిపించింది. కొన్నిసార్లు చంద్రబాబు, లోకేష్ల అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లిని టీడీపీ వారు అవమానించారని బాధపడ్డారు. అంతేకాదు. గతంలో పరిటాల రవి తనకు గుండు కొట్టించినట్లు టీడీపీ ఆఫీస్ నుంచే ఫోన్‌లు వెళ్లాయని కూడా ఆయన ఆవేదన చెందారు. దాంతో టీడీపీతో ఆయన ఇక సంబంధాలు పెట్టుకోరేమోలే అని ఆయన అభిమానులు అనుకున్నారు.

కాని 2019 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్‌ వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు ఎవరికి టిక్కెట్లు ఇవ్వమంటే వారికి టిక్కెట్లు ఇవ్వడం చేశారన్న దృష్టాంతాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో టీడీపీ అధికారం కోల్పోగా, జనసేన పూర్తిగా పరాజయం చెందింది. చివరికి  పవన్ కల్యాణే రెండు చోట్ల ఓడిపోయారు. ఆ వెంటనే వామపక్షాలకు గుడ్ బై చెప్పి డిల్లీ వెళ్లి బీజేపీని బతిలమాడుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. అయినా జనసేన, బీజేపీల మధ్య పొత్తు పెద్ద సీరియస్‌గా సాగలేదు. అదే సమయంలో చంద్రబాబుతో పరోక్ష సంబంధాలు నెరపుతూ వచ్చారు. చివరికి కొంతకాలం క్రితం ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.

టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకటి కావాలని ఆయన ఆకాంక్షించారు. విన్నవారికి ఇది ఆశ్చర్యం అనిపించినా, ఆయన అసలు అంతరంగం తెలిసిన వారికి చిత్రమనిపించలేదు. కాని తదుపరి మరో సందర్భంలో ఒక కండిషన్ పెట్టారు. తనకు ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని, అప్పుడే టీడీపీతో పొత్తు సాధ్యమని సంకేతాలు పంపించారు. అయినా పవన్ కల్యాణ్‌ బలహీనత బాగా తెలిపిన చంద్రబాబు దానిని అసలు పట్టించుకోలేదు. తత్పలితంగా పవన్ కల్యాణ్‌ తానే తగ్గి చివరికి ఎలాంటి షరతులు లేకుండా చంద్రబాబు వద్ద సరెండర్ అయినట్లుగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

తన సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ వద్ద మర్యాద పూర్వకంగా కూర్చున్న విషయాన్ని కూడా వివాదాస్పదం చేసిన పవన్ కల్యాణ్, తాను మాత్రం చంద్రబాబు పక్కన నిలబడి అత్యంత విధేయత ప్రదర్శిస్తూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ సందర్భంలో కలిశారు?. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రులపైన జనసేన కార్యకర్తలు దాడులకు తెగబడిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం, పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌లో నిందితులు ఆశ్రయం పొందడం, వారిని పట్టుకుని పోలీసులు అరెస్టు చేయడం, ఆ క్రమంలో పవన్‌కు నోటీసులు ఇవ్వడం వంటివి జరిగాయి.

సాధారణంగా ఎక్కడైనా దాడులకు గురైన వారికి సంఘీభావం చెబుతారు. లేదా సానుభూతిగా ఒక ప్రకటన చేస్తారు. కాని చంద్రబాబు.. దాడులకు పాల్పడ్డ జనసేన వారికి మద్దతుగా పవన్‌ను కలిశారు. విశాఖలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి పవన్ కల్యాణ్ చేసిన కృషిని మెచ్చుకోవడానికి ఆయన కలిశారు. ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం అంతకుముందు పవన్ కల్యాణ్ తన పార్టీ మీటింగ్‌లో నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడడం హైలెట్ అని చెప్పాలి. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని చెప్పు చూపడం, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని చెప్పడం, ఇలా చిత్రవిచిత్రమైనబూతులతో ఆయన ఆవేశం నటిస్తూ మాట్లాడారు.

ఆ వెంటనే చంద్రబాబు వెళ్లి పవన్‌ను కలవడం.. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లు స్పష్టంగానే బోధపడుతుంది. వీరిద్దరూ ప్రజాస్వామ్యం కోసం కలిశారట. దాడులు చేయడమే ప్రజాస్వామ్యమని వీరు కొత్త నిర్వచనం చెబుతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులోనే ఆపేసి, వెనక్కి పంపించిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకుంటున్నారు. విశాఖ కాండిల్ ర్యాలీకి రావాలనుకున్న జనసేన కార్యకర్తలకు కూడా టీడీపీ ప్రభుత్వం అదే విధంగా ట్రీట్ మెంట్ ఇచ్చింది.. అయినా పవన్ కళ్యాణ్ తన అవమానాలన్నిటిని దిగమింగుకుని చంద్రబాబుతో మళ్లీ స్నేహం చేయడానికి ముందుకు వచ్చారంటే ఏమనుకోవాలి. అందుకే వైసీపీ నేతలు ఈయనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తుంటారు.

పవన్ చెప్పుతీస్తే, ఆల్ రెడీ గాజువాక, భీమవరంలలో పవన్‌కు ప్రజలు చెప్పులు చూపించి పంపించారని, వైసీపీ ఎద్దేవా చేసింది. తాము వంద సార్లు ప్యాకేజీ  స్టార్ అంటామని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, ఎన్ని సీట్లను టీడీపీ జనసేనకు కేటాయిస్తుందన్నది చర్చనీయాంశంగా ఉంది. సుమారు 25 నుంచి ముప్పైవరకు టిక్కెట్లు ఇవ్వవచ్చని, బీజేపీ కూడా ఒకవేళ ఈ కూటమిలో కలిస్తే వారికి ఒక పది సీట్లు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.

కాని బీజేపీ ఇందుకు సిద్ధంగా లేదని అంటున్నారు. గెలిస్తే పెత్తనం టీడీపీదేనని పవన్ కల్యాణ్ ఒప్పుకున్న తర్వాతే చంద్రబాబు ఈ నాటకాన్ని నడిపించి ఉండాలి. చంద్రబాబు లక్ష్యం ఎలాగైనా వైసీపీని దెబ్బతీయడం అయితే, పవన్ కల్యాణ్ లక్ష్యం ఎలాగైనా తాను ఒక్కడినైనా ఈసారి ఎమ్మెల్యే కావాలన్నది కావచ్చు. అయినా జగన్ స్కీములు, వివిధ కార్యక్రమాల ముందు ఈ కూటమి నిలుస్తుందా అన్నది సందేహమే. విడివిడిగా పోటీచేస్తే జగన్‌ను ఓడించడం అసాధ్యమన్న అభిప్రాయానికి చంద్రబాబు రావడంతోనే మరోసారి పవన్ కల్యాణ్‌ను తన ట్రాప్‌లో వేసుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు తప్పు ఉందని అనలేం. ఆయన తన స్టైల్ లో రాజకీయం చేస్తుంటే, పవన్ కల్యాణ్‌ మాత్రం చంద్రబాబుకు సరెండర్ అయి జనసేన కార్యకర్తలు మరోసారి టీడీపీకి సేవ చేయించేందుకు సిద్ధపడుతున్నారన్నమాట.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top