
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సోయి లేకుండా విమర్శలు చేస్తున్నారని, ఇక ఆయన ఆటలు సాగబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతోందని, విచారణ ప్రారంభమవుతోందని కేసీఆర్‌లో భయం మొదలైందని.. అందుకే ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జైలుకు పోకుండా, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘అవినీతి సొమ్మును కక్కించేదాకా కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లెక్క పారిపోదామనుకుంటున్నావేమో.. నీ ఆటలు సాగవ్. నిన్ను రాష్ట్రం వదిలి పోనియ్యం. జైల్లో పెట్టడం ఖాయం. రాజ్యాంగాన్ని, రాష్ట్ర ప్రజలను, ప్రధాని మోదీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన విషయంగా ప్రధాని మోదీ అన్న మాటల్లో తప్పులేదని, అందువల్లే కేసీఆర్ ఆ వ్యాఖ్యలపై మాట్లాడలేదని పేర్కొన్నారు.
మోదీని ఎందుకు తరిమికొట్టాలి?
ప్రధాని మోదీని తరిమికొట్టాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘మోదీని ఎందుకు తరిమికొట్టాలి? లాక్‌డౌన్ సమయంలో ప్రజలను ఆదుకున్నందుకా? దేశానికి ఫ్రీ వ్యాక్సిన్ అందించినందుకా? ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? కేసీఆర్ చెల్లని రూపాయి.. ఎవరూ దేకడం లేదు. అందుకే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి.. ఏం మాట్లాడుతున్నరో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఉఫ్ అని ఊదేస్తారా? టీఆర్‌ఎస్ గింతంత పార్టీ. బీజేపీ ప్రపంచంలోనే నంబర్‌వన్ పార్టీ. మాతో పెట్టుకుంటే మాడి మసైపోతరు’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భయం లేకపోతే.. అడుగడుగునా తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టులు చేస్తున్నారని, సభలో ఎందుకు బెదిరిస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడే బూతులు తెలంగాణ భాష కాదని, ఆ మాటలను జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్–కాంగ్రెస్ చీకటి ఒప్పందం
టీఆర్‌ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనున్న చీకటి ఒప్పందాల బాగోతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం సీఎం కేసీఆర్ భువనగిరి సభలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొద్దిరోజులుగా పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతున్నారని తెలిపారు. 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్–టీఆర్‌ఎస్ కలిసి పోటీచేసిన సంగతిని గుర్తుచేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్–టీఆర్‌ఎస్ పోటీ చేసేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.
దీన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. శనివారం రాత్రి జిల్లా పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న తన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజ్యాంగంపై, ప్రధానిపై కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ... అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో పాటు రౌండ్ టేబుల్ భేటీలు నిర్వహించాలని ఆదేశించారు.