నియామక పత్రాల పేరిట ఆర్భాటం | Sakshi
Sakshi News home page

నియామక పత్రాల పేరిట ఆర్భాటం

Published Thu, Feb 1 2024 4:15 AM

Harish rao comments over revanth reddy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్‌ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్‌ ఆఫీసర్‌లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్‌నర్స్‌ల భర్తీ నోటిఫికేషన్‌ ప్రకటించి, నియామక పత్రాలు ఇచ్చారా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సొమ్మొకడిది సోకు ఇంకొకడిది.. అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్‌ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నామన్నారు. 

గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఏమైంది? 
‘ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇస్తామన్న హామీ ఏమైంది? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ.500 సిలిండర్, 4,000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ.2,500 పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి హామీల లిస్ట్‌లో నేడు జాబ్‌ కేలెండర్‌ కూడా చేరింది’అని హరీశ్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 1.65 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామన్నారు.

Advertisement
Advertisement