అందుకే ఓటింగ్‌ శాతం తగ్గింది : కిషన్‌ రెడ్డి | GHMC Elections 2020: Kishan Reddy Slams TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్రభుత్వం‌ సిగ్గుతో తల దించుకోవాలి : కిషన్‌ రెడ్డి

Dec 1 2020 8:02 PM | Updated on Dec 2 2020 4:35 AM

GHMC Elections 2020: Kishan Reddy Slams TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గినందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.
(చదవండి : గ్రేటర్‌ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!)

పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు. ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ పెట్టడం తిరోగమన చర్యగా అభివర్ణించారు.  పోలింగ్ శాతం తగ్గించడానికి టీఆర్‌ఎస్‌ లేనిపోని అపోహలు సృష్టించారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్‌ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం కలిగిందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 
(చదవండి : పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు)

కాగా, గత ఎన్నికలలో పోలిస్తే ఈ సారి గ్రేటర్‌లో ఓటింగ్‌ శాతం భారీగా తగ్గింది. సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదు కాగా, మలక్‌పేట్‌, కార్వాన్‌లో అత్యల్పంగా ఓటింగ్‌ నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement