గ్రేటర్‌ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!

GHMC Elections 2020 Less Polling Records - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నగరంలో ఎక్కడ చూసినా కోలాహలమే. గ్రేటర్‌ ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకున్న ప్రధాన పార్టీలన్ని ఢీ అంటూ ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగించాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మైకుల మోత.. టపాసుల కాల్చడం వంటివి చేస్తూ సందడి వాతావరణం కనిపించింది. అభ్యర్థులందరూ ప్రచారాలతో హోరెత్తించారు. కానీ నేడు పోలింగ్‌ చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదయ్యింది. మొత్తం మీద 50 శాతం అయినా నమోదవుతుందా లేదా అనే సందేహం తలెత్తుతుంది. ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బూత్‌ ఏజెంట్లు, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. బస్తీలు, నగర శివార్లలో పోలింగ్‌ కాస్త మెరగ్గా ఉంది. ఇక వైట్‌ కాలర్‌ జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ ఒక్కశాతం కూడా దాటకపోవడం గమనార్హం. 

ఈ నేపథ్యంలో జాబ్‌ హోల్డర్స్‌, టెకీల తీరును నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ‘ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం’.. ‘ఆ పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది’.. ‘ఇంత నిరాసక్తత ఎందుకు.. మీకంటే నిరాక్షరాస్యులు మేలు.. ఓటు వేయడం తమ బాధ్యత అనుకుంటారు.. ఓటేయకపోతే.. నేరం చేసినట్లు భావిస్తారు.. కానీ సిటీ జనాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’.. అంటే ‘వీరంతా కేవలం కీ బోర్డు వారియర్లేనా’ అంటూ నగరవాసుల తీరును దుయ్యబడుతున్నారు నెటిజనులు. (వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్‌ : కేటీఆర్‌)

వరుస సెలవులు ఓ కారణం
గ్రేటర్‌లో ఇంత తక్కువ పోలింగ్‌ నమోదు కావడానికి ప్రధాన కారణం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం. పోలింగ్‌ నాడు సెలవు ఇచ్చి.. ఓటు వేయమని చెప్పినా.. చాలా మందికి బద్ధకం. ఇళ్ల దగ్గరే ఉంటారు కానీ ఓటు వేయరు. అలాంటిది శని, ఆదివారాలు వీకాఫ్‌.. సోమవారం గురునానక్‌ జయంతి.. మంగళవారం పోలింగ్‌ కావడంతో ప్రభుత్వ సెలవు అన్ని కలుపుకుని వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో టెకీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు ఊరి బాట పట్టారు. పోలింగ్‌ ఇంత తక్కువ నమోదవ్వడానికి ఇది ప్రధాన కారణం. ఇక ఓట్లు వేరే చోటకి మారడంతో అక్కడికి వెళ్లి ఓటు వేయడం ఇష్టం లేక కొందరు ఊరుకున్నారు. ఇక కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. 

ప్రచారం వరకే.. పోలింగ్‌ను పట్టించుకోని పార్టీలు
ఇక ఎన్నికలనగానే నామినేషన్ల దాఖలు నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా దూసుకుపోయే పార్టీలు.. పోలింగ్‌ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ప్రచారంలో దూసుకుపోయే పార్టీలు.. ఓటు వేయండి అంటూ ప్రజలను చైతన్యం చేయడంలో వెనకబడ్డాయనే చెప్పవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా వచ్చి ఓటేసి.. జనాలను ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికి నగర ఓటరు  తీరులో మాత్రం పెద్దగా మార్పు లేదు. (చదవండి: చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!)

గ్రామాల్లో పండగ వాతావరణం
ఇక ఏ ఎన్నికలయినా సరే పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ అధికంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు పోలింగ్‌ నాటికి స్వగ్రామాలకు వచ్చి తప్పక ఓటు వేస్తారు. స్థానిక నాయకులు కూడా ప్రత్యేక శ్రద్దతో ఓటర్లను తరలిస్తారు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్ని పనులున్నా ఓటు వేయడం మాత్రం మర్చిపోరు. 

ఇక నగరవాసుల తీరు పట్ల నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేయని వారి ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు వంటివి రద్దు చేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలింగ్‌ ముందు ఇలా వరుస సెలవులు రాకుండా చూసుకోవాలంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top