breaking news
ghmc polling
-
పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది. ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కంటే నగర శివారుల్లో పోలింగ్ కాస్త మెరుగ్గా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. (చదవండి : గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!) పోలింగ్‌కు మరో గంటన్నర సమయం మాత్రమే ఉన్నా.. ఓటర్లు బయటకు రావడంలో లేదు. చాలా చోట్ల పోలీంగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. మధ్యాహ్నం దాటిన ఓటర్లు రాకపోవడంతో ఓ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది నిద్రపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. (చదవండి : గ్రేటర్ ఫైట్: లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్) జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి తక్కువ ఓటింగ్ శాతం నమోదువుతుంది. 2016లో 45.25 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టిన నాయకులు.. ఓటర్లను బూత్‌కి రప్పించడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలో ఓటేసిన ప్రముఖులు
-
గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!
సాక్షి, హైదారాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నగరంలో ఎక్కడ చూసినా కోలాహలమే. గ్రేటర్ ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకున్న ప్రధాన పార్టీలన్ని ఢీ అంటూ ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగించాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మైకుల మోత.. టపాసుల కాల్చడం వంటివి చేస్తూ సందడి వాతావరణం కనిపించింది. అభ్యర్థులందరూ ప్రచారాలతో హోరెత్తించారు. కానీ నేడు పోలింగ్ చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. మొత్తం మీద 50 శాతం అయినా నమోదవుతుందా లేదా అనే సందేహం తలెత్తుతుంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బూత్ ఏజెంట్లు, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. బస్తీలు, నగర శివార్లలో పోలింగ్ కాస్త మెరగ్గా ఉంది. ఇక వైట్ కాలర్ జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ఒక్కశాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జాబ్ హోల్డర్స్, టెకీల తీరును నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ‘ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం’.. ‘ఆ పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది’.. ‘ఇంత నిరాసక్తత ఎందుకు.. మీకంటే నిరాక్షరాస్యులు మేలు.. ఓటు వేయడం తమ బాధ్యత అనుకుంటారు.. ఓటేయకపోతే.. నేరం చేసినట్లు భావిస్తారు.. కానీ సిటీ జనాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’.. అంటే ‘వీరంతా కేవలం కీ బోర్డు వారియర్లేనా’ అంటూ నగరవాసుల తీరును దుయ్యబడుతున్నారు నెటిజనులు. (వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్ : కేటీఆర్) వరుస సెలవులు ఓ కారణం గ్రేటర్లో ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం. పోలింగ్ నాడు సెలవు ఇచ్చి.. ఓటు వేయమని చెప్పినా.. చాలా మందికి బద్ధకం. ఇళ్ల దగ్గరే ఉంటారు కానీ ఓటు వేయరు. అలాంటిది శని, ఆదివారాలు వీకాఫ్.. సోమవారం గురునానక్ జయంతి.. మంగళవారం పోలింగ్ కావడంతో ప్రభుత్వ సెలవు అన్ని కలుపుకుని వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో టెకీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు ఊరి బాట పట్టారు. పోలింగ్ ఇంత తక్కువ నమోదవ్వడానికి ఇది ప్రధాన కారణం. ఇక ఓట్లు వేరే చోటకి మారడంతో అక్కడికి వెళ్లి ఓటు వేయడం ఇష్టం లేక కొందరు ఊరుకున్నారు. ఇక కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. ప్రచారం వరకే.. పోలింగ్‌ను పట్టించుకోని పార్టీలు ఇక ఎన్నికలనగానే నామినేషన్ల దాఖలు నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా దూసుకుపోయే పార్టీలు.. పోలింగ్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ప్రచారంలో దూసుకుపోయే పార్టీలు.. ఓటు వేయండి అంటూ ప్రజలను చైతన్యం చేయడంలో వెనకబడ్డాయనే చెప్పవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా వచ్చి ఓటేసి.. జనాలను ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికి నగర ఓటరు తీరులో మాత్రం పెద్దగా మార్పు లేదు. (చదవండి: చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!) గ్రామాల్లో పండగ వాతావరణం ఇక ఏ ఎన్నికలయినా సరే పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ అధికంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు పోలింగ్ నాటికి స్వగ్రామాలకు వచ్చి తప్పక ఓటు వేస్తారు. స్థానిక నాయకులు కూడా ప్రత్యేక శ్రద్దతో ఓటర్లను తరలిస్తారు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్ని పనులున్నా ఓటు వేయడం మాత్రం మర్చిపోరు. ఇక నగరవాసుల తీరు పట్ల నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేయని వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి రద్దు చేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలింగ్ ముందు ఇలా వరుస సెలవులు రాకుండా చూసుకోవాలంటున్నారు. -
వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల పోరులో పేలవమైన పోలింగ్ శాతం నిరాశపరుస్తున్న తరుణంలో పెద్దవాళ్లు శ్రమకోర్చి మరీ ఓటు వేస్తున్న సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌పై నగర వాసుల ఆసక్తి అంతంత మాత్రంగానే ఉండగా వికలాంగులు, వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా 80 ఏళ్ల సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు పద్మశ్రీ ట్విటర్లో వెల్లడించారు. తన అమ్మమ్మకు టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు లాక్డౌన్ తరువాత తొలిసారి గడప దాటి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ దీన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. అమ్మమ్మకు చాలా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. కరోనాకారణంగా గత 3 నెలలుగా కదల్లేకుండా ఉన్నప్పటికీ, రవీందర్ (చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్) అమీర్‌పేట పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో వచ్చి మరీ ఓటు వేశారు. మరో సంఘటనలో తన తండ్రి, హృద్రోగి. నడవలేని స్థితిలో టీఆర్ఎస్కు ఓటు వేశారంటూ మరొకరు ట్వీట్ చేశారు. మీపనితనాన్ని చూసిన మా అత్తగారు తన జీవితంలో తొలిసారి ఓటువేశారంటూ ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం. అటు భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కలప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 18.20 శాతం మాత్రమే. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దయింది. ఓల్డ్ మలక్‌పేట 69వ డివిజన్లో డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. Many thanks to your Ammama🙏 She is an inspiration to all those who only complain but do not make the effort to come out and vote https://t.co/bA10KQGKzn — KTR (@KTRTRS) December 1, 2020 Senior Actor #KotaSrinivasaRao along with his wife casted vote at FNCC.#GHMCElections2020 #GHMC2020 pic.twitter.com/5OHe1Ev2fE — BARaju (@baraju_SuperHit) December 1, 2020 🙏 https://t.co/Gf3AQ0oq0i — KTR (@KTRTRS) December 1, 2020 -
జీహెచ్ఎంసీ ఎన్నికలు : మందకొడిగా పోలింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంపుపై తీవ్రం కృషి చేసిన అధికారులకు నిరాశే ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు... తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయినా ఓటింగ్ శాతంగాఅంతంతమాత్రమే. దీంతో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పోలింగ్ సరళిపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ‘‘మేమంతా..ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!!’’ అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ తేజ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రాంతాల్ లోమందకొడిగా సాగుతోంది. పోలింగ్ మొదలై దాదాపు మూడు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలింగ్ శాతం 3 శాతానికి మించలేదంటే పరిస్థితిని అర్ధం చేసు కోవచ్చు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఒకవైపు చలి తీవ్రత, కోవిడ్-19 ఆందోళన ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇపుడిపుడే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓట్లరు బారులు తీరుతున్నారని సమాచారం. మేము అంతా ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!! #ghmcelections2020 pic.twitter.com/rUZbGuwzJZ — Tanikella Bharani (@TanikellaBharni) December 1, 2020 -
గ్రేటర్ వార్: స్పందించని నగర వాసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి అతి తక్కువ పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఆర్సీపురం, పటాన్చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, మలక్‌పేట్, కార్వాన్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఇక గుర్తులు తారుమారుతో ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దయింది. అక్కడ డిసెంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితంగా ఈ రోజు వెల్లడించాల్సిన ఎగ్జిట్ పోల్స్ వాయిదా పడ్డాయి. రీపోలింగ్ ముగిసే వరకు ఎవరూ ఎలాంటి ఎగ్జిస్ట్ పోల్స్ ప్రకటించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీలో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. నగర వాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో వైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు జనం బయటకు రాలేదు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్ల నుంచే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతల దూషణల పర్వం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016లో 45.25 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ►మధ్యాహ్నం మూడు గంటల వరకు బోరబండ 35.69, అల్లాపూర్ 33.43, వెంగల్‌రావ్‌నగర్ 28.32, రెహమత్నగర్ 31.11 , ఎర్రగడ్డ 30.55, ఫతేనగర్ 34.77 శాతం, సనత్‌నగర్ 26.19, అమీర్‌పేట్ 26.21, ఫలక్‌నుమా 17, నవాబ్సాబ్ కుంట 18.2, దూద్‌బౌలి 17.98, జహాన్నుమా 11.95, కిషన్‌బాగ్ 14.23, లలితాబాగ్ 26.26, రియాసత్‌నగర్ 23.32, కంచన్‌బాగ్ 32.32, చాంద్రయాణగుట్ట 18.98, ఉప్పుగూడ 29.37, గోషామహల్ 16.03, మంగళ్‌హట్ 19.69, భారతినగర్‌లో 49.54, పటాన్చెరు 51.52 పోలింగ్ నమోదయ్యింది. లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యధికంగా బాగ్అంబర్పేట్ 64.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ పరిస్థితి... ►సికింద్రాబాద్ జోన్‌లోని అంబర్‌పేట 16వ నంబర్ సర్కిల్లో పరిధిలో ఆరు డివిజన్లలో ఇప్పటివరకు 42.47 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా బాగ్ అంబర్ పేట డివిజన్లో 64.79 శాతం నమోదైంది. డివిజన్ వారీగా హిమాయత్ నగర్-35.89, కాచిగూడ-38.94, నల్లకుంట-38.03, గోల్నాక-36.34, అంబర్పేట్-38.59, బాగ్ అంబర్పేట్-64.78 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ►కుర్మగూడ డివిజన్ ఆపిల్ స్కూల్లో నకిలీ ఓటు వేయడానికి వచ్చిన మహిళను ఏజెంట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెయిన్ బజార్ పోలీసులకి అప్పగించారు. బీజేపీ అభ్యర్థి శాంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగాపురాలో ఉద్రిక్తత.. ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారంటూ జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌గౌడ్ ఆందోళనకు దిగారు. జూబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం నాయకులను బూత్‌ల నుండి బయటకు పంపాలని టీఆర్ఎస్ అభ్యర్థి పోలీసులను కోరినా సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మొత్తం ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని ఆనంద్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు ధర్నా.. ►ఉప్పల్ పదవ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్.. సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపుర్ డివిజన్ హఫీజ్‌పేట, ప్రేమ్‌నగర్ పోలింగ్ కేందాన్ని సీపీ సందర్శించారు. కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లిలోని పలు డివిజన్లలోని పోలింగ్ బూత్‌లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా ఎటువంటి గొడవలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రజలు అందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. డివిజన్ స్థాయి వారిగా ఓటింగ్ శాతం: ►ఉప్పల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ శాతం ఇలా ఉంది. కాప్రా-25.73 శాతం, ఏఎస్రావు నగర్-24.60 శాతం, చర్లపల్లి-24.67 శాతం, మీర్‌పేట హౌసింగ్ బోర్డు-24.05 శాతం, మల్లాపూర్ 29.93 శాతం, నాచారం- 23.60 శాతం, చిలుకానగర్ - 36.12 శాతం, హబ్సీగూడ-33.91 శాతం, రామాంతపూర్ 36.62 శాతం, ఉప్పల్- 41.01 శాతం. ►జీహెచ్ఎంసీ డివిజన్ స్థాయి వారిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ సరళి ఇలా ఉంది. వనస్థలిపురం- 29.03 శాతం, హస్తినపురం - 30.08 శాతం, నాగోల్ 24.93 శాతం, మన్సూరా బాద్-22.39 శాతం, హాయత్ నగర్-24.93 శాతం, బీఎన్‌రెడ్డి నగర్ 24.54 శాతం. గుండాలను తీసుకొచ్చి రిగ్గింగ్.. ►లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ►ఉప్పల్‌లో 10వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల్లా పరమేశ్వరరెడ్డి సూర్యాపేట నుండి గుండాలను తీసుకొచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి అరేటికాయల షాలిని భాస్కర్ తెలిపారు. రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడ తమనే బెదిరిస్తున్నారని ఆవేదన చేశారు. ►సంతోష్ నగర్ రియసత్ నగర్ డివిజన్లో బుర్కా ధరించి ఓట్లు వేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక్ మార్క్ చెరిపేసుకుని మహిళలు మళ్ళీ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. దొంగ ఓట్లు అనుమానంతో.. ఉప్పల్ పదవ డివిజన్.. ఇరవై ఐదో బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారన్న అనుమానంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు.. ఇద్దరిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. బీఎన్ రెడ్డి నగర్లో ఉద్రిక్తత ►బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బూత్ నెంబర్ 60, 61లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేపట్టారు. ►జంగమేట్ డివిజన్లోని పోలింగ్ బూత్ 27, 32 వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిగ్గింగ్, దొంగ ఓట్లు పడుతున్నాయని అడ్డుకోవడానికి వచ్చిన బీజేపీ నాయకులను ఎంఐఎం కార్యకర్తలు తరిమికొట్టారు. జగద్గిరి గుట్ట సీఐ వీరంగం కూకట్పల్లి 121 డివిజన్ దీనబంధు కాలనీ 48వ బూతు వద్ద జగద్గిరి గుట్ట సీఐ వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్ టేబుళ్లను బూటు కాళ్లతో తన్నుతూ.. బీజేపీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీఐకి ఎదురు మాట్లాడిన వారిపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఓటేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ►జూబ్లిహిల్స్ బిఎస్ఎన్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, భార్య శ్రీకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►బంజారాహిల్స్ ఈరో కిడ్స్ స్కూల్లో విజయ శాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో హీరో రామ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►జీడిమెట్ల డివిజన్ కుత్బల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆధార్ కార్డులో ఫోటో మార్ఫింగ్ చేసి ఓటేశారు ఉప్పల్‌లో దొంగ ఓట్లు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆధార్ కార్డులోని ఫోటోలను మార్ఫింగ్ చేసి యువకులు ఓటు వేసినట్లు తెలుస్తోంది. వీరిని కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట నుంచి తీసుకొచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►సినీ నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►గ్రేటర్ పోలింగ్‌లో గుర్తులు తారుమారైన నేపథ్యంలో ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో 3న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరుగంటల తర్వాత వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్‌పై ఎస్ఈసీ నిషేదం విధించింది. ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలి ►జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా లాంటి దేశాలు సైతం మన భారతదేశ ఎన్నికల విధానంపై ప్రశంసలు కురిపిస్తాయి. అలాంటిది మందకొడిగా పోలింగ్ శాతం సాగడం సరైంది కాదు. ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలిని పిలుపునిచ్చారు. ►బంజారాహిల్స్ జీఎస్డీ దేవ్ స్కూల్లో (డివిజన్ నెంబర్ 92 వెంకటేశ్వరరావు కాలనీ) ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో నిర్మాత సి అశ్వనీదత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహలతా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం11 గంటల వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేయడానికి ముందుకురండి: విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కచ్చితంగా ఓటు వేయడానికి ముందకు రావాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. మంత్రి పువ్వాడ అనుచరుల కారు ధ్వంసం కేపీహెచ్‌బీ ఫోరంమాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు డబ్బు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి అనుచరుల కార్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పువ్వాడ అనుచరులకు సంబంధించిన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దు..! ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్ధిని గర్తు తారుమారుకావడంతో 1,2,3,4,5 కేంద్రాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్‌ను రద్దు చేశారు. దీనిపై మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓల్డ్‌మలక్‌పేట్‌లో ఈ నెల 3న రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంది. ఎన్నికలు రద్దు చేయాలి: సీపీఐ ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్ధిని గర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి నక్షత్రాన్ని ఎన్నికల అధికారులు ముద్రించారు. దీంతో డివిజన్ ఎన్నికలు రద్దుచేసి మరోసారి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. జీ్హెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా అత్యధికంగా రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో అత్యధికంగా 9.02 పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా సమస్యాత్మక ప్రాంతమైన చాంద్రాయణగుట్టలో 0.07శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసేందుకు ముందుకు రండి: మంత్రి మహమూద్ అలీ మలక్‌పేట సర్కిల్ అజంపూరా డివిజన్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీని గెలిపిస్తాయి. ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేవి చాలా ముఖ్యమైనది. బల్దియా ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అన్నారు. పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతం జీహెచ్ఎంసీ పోలింగ్ పాతబస్తీలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే కూలైన్లలో ఓటర్లు పెరుగుతున్నారు. చంద్రాయనగుట్ట సర్కిల్ పరిధిలోని జంగమెట్ డివిజన్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న ఈ ప్రాంతంలో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు ఇక్కడనుంచి పోటీపడుతున్నారు. ఓటును హక్కుగా భావించాలి: తలసాని మారేడుపల్లిలోని కస్తూర్భాగాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని తలసాని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ ఉందని వెనక్కి వెళ్లవద్దని ఓటును హక్కుగా భావించాలని తలసాని అన్నారు. ►కూకట్పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేస్ పోలింగ్ బూత్ నెంబర్ 58 వద్ద సినీ హీరో రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో ఉద్రిక్తత సంగారెడ్డి జిల్లా: భారతి నగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలో సొసైటీ ఆఫీస్ 111వ నెంబర్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ఫోటోతో కూడిన పోలింగ్ స్లిప్‌ల పంపిణీపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూన్నారంటూ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే కుమారుడు పటాన్చెరు డివిజన్లోని చైతన్య కాలనీ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్త నర్సింగ్పై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి చెయ్యిచేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎమ్మెల్యే సతీమణి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని అక్కడనుంచి తీసుకెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని గొడవ జరగకుండా ఆపారు. బీజేపీ కార్యకర్త నర్సింగ్‌ను పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఉమెన్స్ కోఆపరేటివ్ సోసైటీలో అక్కినేని నాగార్జున, అమల ►జూబ్లీహిల్స్ ఉమెన్స్ కోఆపరేటివ్ సోసైటీలో బూత్ నెంబర్ 95లో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అక్కినేని అమల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి దంపతులిద్దరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 135వ డివిజన్లో బూత్ నెంబర్ 38లో ప్రజాగాయకుడు గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన ఎస్ఈసీ ►ఎస్ఈసీ పార్థసారధి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-4లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 3.10 శాతం పోలింగ్ నమోదైంది. దైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీజీపీ కుందన్‌బాగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధి. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది' అని తెలిపారు. ►జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో డైరెక్టర్ తేజ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్. రెడ్డి నగర్ ప్రగతి విద్యాలయ పాఠశాలలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకుని మంచి పరి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. ప్రజలకు ఓటు హక్కు అస్త్రం లాంటిదన్నారు. ►ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హఫీజ్ పేటలో టెన్షన్ టెన్షన్.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్రమైన తోపులాటకు దారితీసింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించడంతో.. బీజేపీ కార్యకర్తలు శాంతించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ►వెంకటేశ్వర కాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14, నందినగర్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అభివృద్ధి చేసే వాళ్లకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ►టీఆర్‌పార్టీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆయన సతీమణి స్వప్న హబ్సిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర మైలాన్దేవ్ పల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, చర్లపల్లి డివిజన్ అభ్యర్థి బొంతు శ్రీదేవితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ►ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబంతో సహా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►శాస్త్రిపురం డివిజన్లోని సేంట్ ఫైజ్ పాఠశాలలో బైక్‌పై వచ్చి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ కుందన్‌బాగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల ఘర్షణ వాతావరణం ►ఎల్బీనగర్ ఆర్కేపురం డివిజన్ బూత్ నెంబర్ 42, 45లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ►మీర్ పేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ విక్రమ్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నాడని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖలు నిఘా పటిష్టం చేశాం: సీపీ మహేష్ భగవత్ ►కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేశాము. రాచకొండ కమిషనరేట్ పరిదిలో ప్రశాంత వాతావరణం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టాము' అని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ►నాంపల్లిలోని వ్యాయమశాల హైస్కూల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జూబ్లీక్లబ్‌లో చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కుందన్‌బాగ్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా ఓటేసిన మంత్రి కేటీఆర్ ►గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన కేటీఆర్ 8వ నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని నగర అభివృద్ధిలో భాగస్వాములుకావాలని కోరారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో 74,44,260 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. కాగా, ఎన్నికల్లో 28,683 బ్యాలెట్ పెట్టె్టలను సిద్ధంగా చేయగా, 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పెట్టెలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు. ఆ పార్టీలకు ప్రతిష్టాత్మకం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలపడాలని భావిస్తోంది. ఇటు బల్దియా ఎన్నికల్లో తాము సైతం గట్టి పోటీ ఇచ్చి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పేర్కొంటోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలవగా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో 82 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవగా, ఈ సారి కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యంపై నగర ఓటర్లు కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. గత ఎన్నికల్లో ఇలా... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు. -
కాంగ్రెస్‌ను ప్రజలు బహిష్కరించారు
ఖేడ్‌లోనూ భంగపాటు తప్పదు: హరీశ్ నారాయణఖేడ్: జీహెచ్ఎంసీ, వరంగల్‌లో కాం గ్రెస్, టీడీపీలను ప్రజలు బహిష్కరించారని, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బహిష్కరిస్తారని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి, గంగాపూర్, ర్యాకల్ గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా కాంగ్రెస్ ఎక్కడుందని, వరంగల్‌లో ప్రజలు ఎప్పుడో చిత్తుగా ఓడించారన్నారు. జీహెచ్ఎంసీ పోలింగ్ సరళి, సర్వే ఫలితాలు పత్రికల్లో వచ్చాయని, అక్కడా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ ప్రజలు, వరంగల్ ప్రజలు కాంగ్రెస్‌ను బహిష్కరించాక నారాయణఖేడ్‌లో మనమెందుకు బహిష్కరించకూడదని ప్రజలతో అన్నారు. ఖేడ్‌లో కాంగ్రెస్ నాయకులు మొసలికన్నీరు కార్చేందుకు రానున్నారని, మొసలి కన్నీరు కావాలో, ఇంట్లో తాగేందుకు నీళ్లు కావాలో తేల్చుకోవాలన్నారు. తాను జిల్లాకు చెందిన మంత్రినని, ఈ ప్రాంతం అభివృద్ధి బాధ్యత తనపై ఉందన్నారు. వారానికోసారి తాను ఖేడ్ వస్తానన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అలా రాగలడా?, ఎన్నికలయ్యాక నల్లగొండలో ఉంటాడని ఎద్దేవా చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అభ్యర్థి భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నేను ఓటేశా.. మీరూ బయటకు రండి
పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చి ఓటేశానని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. నగర పౌరులంతా కూడా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. తనకు తెలిసినంత వరకు జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఎలాంటి ఇబ్బందులు లేవని, ఏర్పాట్లన్నీ సక్రమంగానే ఉన్నాయని అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యంలో పౌరులంతా తమ ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ఓటు వేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించేవాళ్లంతా ముందుకొచ్చి ఓటేయాలని కోరారు. పోలింగ్ స్లిప్ అందకపోతే ఇంటర్నెట్లో tsec.gov.in అనే వెబ్సైట్లో చూసుకుని ఆ నెంబరు ప్రకారం ఓటేయొచ్చని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.