చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!

GHMC Elections 2020: How To Cast Vote Amid Coronavirus Situation - Sakshi

కరోనా కాలం.. జర శుభ్రం

ఓటుకు ముందు.. తర్వాత శానిటైజర్‌ రాసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఆ కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలు ప్రజలకు విన్నవించాయి. పోలింగ్‌స్టేషన్‌లోకి ప్రవేశించేప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వెళ్లాలి. లేకపోతే లోనికి అనుమతించరు. అలాగే పోలింగ్‌ బూత్‌ల దగ్గర క్యూలైన్లలో ఒకరికొకరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాకార గుర్తులు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే నిలబడి బూత్‌లోకి లైన్‌గా వెళ్లాలి. 

బూత్‌లో పలుచోట్ల తాకాల్సి ఉంటుంది..
అక్కడ ఏర్పాటు చేసిన శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాక బూత్‌లోకి ప్రవేశించాలి. బ్యాలెట్‌ పత్రం ద్వారా ఓటు వేయాల్సి ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బూత్‌లోనికి వెళ్లగానే మొదటి పోలింగ్‌ అధికారి ఓటర్‌ జాబితాలో పేరుందా లేదా చూస్తారు. అందుకోసం ఓటర్‌ తమ గుర్తింపు కార్డును అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి గుర్తింపు కార్డును పట్టుకొని చూసి తిరిగి ఇచ్చేస్తారు. అధికారి తాకిన కార్డును తిరిగి తీసుకున్నప్పుడు కాంటాక్ట్‌ ఏర్పడుతుంది. తర్వాత రెండో అధికారి వద్దకు వెళ్లాలి. అక్కడ ఓటర్‌ ఎడమ చూపుడు వేలుపై సిరా మార్క్‌ వేస్తారు.

మూడో పోలింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రం ఇస్తారు. దాన్ని ఇచ్చేముందు బ్యాలెట్‌ కౌంటర్‌ పాయింట్‌పై ఓటర్‌ సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. తర్వాత బ్యాలెట్‌ పేపర్‌తోపాటు ఓటు వేసేందుకు ఇంకు అద్దిన రబ్బర్‌ స్టాంప్‌ను ఓటర్‌కు ఇస్తారు. అప్పుడు కూడా ఇతరులు వాడిన, అధికారి పట్టుకున్న స్టాంప్‌ను తీసుకోవడం ద్వారా కాంటాక్ట్‌ ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లోకి వెళ్లి ఇష్టమైన అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయాలి. తర్వాత దాన్ని మడతబెట్టి బయటకు వచ్చి ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఉన్న బ్యాలెట్‌ పెట్టెలో వేయాల్సి ఉంటుంది.

ఇలా వివిధ దశల్లో పలుసార్లు చేతులతో వివిధ ప్రాంతాల్లో తాకాల్సి ఉంటుంది. అధికారి అనేకమంది ఓటర్లతో కాంటాక్ట్‌ అవుతారు. కాబట్టి ఓటేసి బయటకు వచ్చాక తక్షణమే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అందుకోసం అవసరమైతే సొంతంగా శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లు పెట్టుకుంటారు. పైగా బూత్‌లోకి ఒక్కరినే అనుమతిస్తారు. వారు ఓటేసి వెళ్లిపోయాక మరొకరిని లోనికి అనుమతిస్తారు. 

కరోనా బాధితులకు గంటపాటు ప్రత్యేక ప్రవేశం
కరోనా పాజిటివ్‌ బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఓటేయడానికి ప్రత్యేక సమయం, ప్రత్యేక ద్వారం కేటాయించారు. వారికి మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు అందజేస్తారు. అదే సమయంలో ఇతర ప్రవేశమార్గాల్లో సాధారణ ఓటర్లు ఓటేయవచ్చు. 
నవంబర్‌ ఒకటో తేదీ తర్వాత కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌కు కూడా అవకాశం కల్పించారు. 
బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్‌ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇస్తారు.
ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
పోలింగ్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారిని మార్చడానికి రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్లను నియమించారు. 
సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్‌స్టేషన్లలో భౌతికదూరం పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు.
బూత్‌లో అధికారులు ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top