బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Former Minister Harishrao Slams Telangana Government Budget - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని, ప్రజాపాలన అబాసుపాలయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వాగ్దాన భంగాలేనన్నారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. 

‘బడ్జెట్‌ ప్రజలకు నమ్మకం ఇవ్వలేదు. అన్నదాతలను అగం చేసే విధంగా ఉంది. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టే విధంగా బడ్జెట్ ఉంది. వ్యవసాయ రంగానికి కేటాయించిన 19 వేల కోట్ల నిధుల్లో రైతు భరోసా ఎలా అమలు చేస్తారు ? రైతు భరోసాకు 22 వేల కోట్ల రూపాయలు అవసరం. రైతు రుణమాఫీ కి మొండి చేయి చూపారు.  రైతు బీమకు కేటాయింపులు ఎక్కడ ? పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన మాటలు బోగస్ గా మారాయి.

రైతులను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. 24 గంటల కరెంట్ సరఫరా ఎక్కడ ఇస్తున్నారో చూద్దాం పదండి. లాగ్ బుక్‌లు పరిశీలిద్దాం రండి. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారు. రెండు సమావేశాలు అయిపోతున్నాయి ఎక్కడ చట్టం ?  వంద రోజుల్లో హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తోంది.

ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. జనవరి నెల అసరా పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఉద్యోగులకు  పెండింగ్ డీఏలు ఇవ్వాల్సి ఉన్నా వాటికి నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top