సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమాచారం ఎవరు లీక్ చేశారు.. మీ మెయిల్ నుంచే అందరికీ ఫార్వాడ్ అయ్యింది.. ఏలూరు గ్రూపుల్లో వైరల్ అయింది.. మీరు చేశారంటే.. మీరు చేశారంటూ.. అధికార పార్టీ కార్పొరేటర్లను స్టేషన్‌కు పిలిచి మరీ విచారించడంతో అసలు ఏం లెటర్.. ఏం లీక్ అనే చర్చ ఏలూరులో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ లేఖ ఏమిటంటే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్, అతని టీమ్ గడిచిన రెండేళ్లల్లో చేసిన అవినీతి అరాచకాల చిట్టా అంటూ ఒక లేఖ వైరల్‌గా మారడం, టీడీపీ కార్పొరేటర్లే వైరల్ చేశారనే అనుమానంతో ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించడంతో వ్యవహారం వైరల్‌గా మారింది.
రెండేళ్ల అవినీతి, అక్రమాలు అంటూ..
ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్ బారి నుంచి ఏలూరు ప్రజానీకాన్ని కాపాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టానానికి వినయపూర్వకంగా చేసుకున్న విన్నపమంటూ 21 పేజీల లేఖ నగరంలో కలకలం రేపింది. దాదాపు నెలన్నర క్రితమే లేఖ వ్యవహారం వెలుగులోకి వచ్చినా అప్పుడు వైరల్ కాకుండా కార్పొరేటర్లకు పోలీస్ కౌన్సెలింగ్‌తో వెలుగులోకి రావడం విశేషం. గత రెండేళ్లలో ఏలూరు నగరంలో ఎవరెవరి వద్ద సెటిల్‌మెంట్ పేరుతో ఎంత వసూలు చేశారనేది, అలాగే లేఅవుట్ల నుంచి భవనాల వరకు, స్వీట్ షాపుల నుంచి ఆస్పత్రుల వరకూ ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేశారనేది ఫోన్ నంబర్లతో సహా 21 పేజీల్లో 53 పాయింట్లతో పీడీఎఫ్ లేఖ వైరల్‌గా మారింది.
ఈ పరిణామాల క్రమంలో గత వారం బడేటి క్యాంపు కార్యాలయంలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికల ముందు నుంచి దూరంగా ఉంటున్న ఓ మాజీ నేతను ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు గత వారం పిలిపించి మూడు గంటల పాటు విచా రించారు. తనకేమీ లేఖతో సంబంధం లేదని, నన్ను ఎలా మీరు ప్రశ్నిస్తారని.. సదరు నేత పోలీసులను గట్టిగా అడగ్గా సరేలే అని పంపించివేశారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఓ కార్పొరేటర్‌కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టి వెంటనే ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు.
సదరు కార్పొరేటర్‌పై అనుమానంతో మూడు, నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారు. చివరిగా 36వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమసుందరిని ఈనెల 23న పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారు. 21 పేజీల డాక్యుమెంట్‌ను మీరు షేర్ చేశారా అని ప్రశ్నించడం, మీపై మరో కార్పొరేటర్ నాయుడు సోము ఫిర్యాదు చేశారంటూ విచారించారు. తాను డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదని.. ఎవరో చేసింది తనకేమీ సంబంధమని పోలీసులకు బదులిచ్చినట్టు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించడంతో 21 పేజీల లేఖ వ్యవహారం వైరల్ అయింది. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో పూర్తి ఆధారాలతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.


