శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన! | YSRCP leaders fires on Mega DSC-2025 in assembly | Sakshi
Sakshi News home page

శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన!

Aug 19 2026 5:54 AM | Updated on Aug 19 2026 5:54 AM

YSRCP leaders fires on Mega DSC-2025 in assembly

మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు

వాయిదా తీర్మానం తిరస్కరణతో పోడియం వద్ద విపక్ష 

ఎమ్మెల్సీల ఆందోళన.. డీఎస్సీపై మండలిలో చర్చకు 

ప్రభుత్వానికి భయమెందుకని నిలదీసిన బొత్స  

కరువు–రైతుల కష్టాలపై చర్చించేందుకు సమావేశాలు 

రెండు రోజులు పొడిగించాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియమకాలలో అవకతవకలపై చర్చకు వైఎస్సార్‌ సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్క­రిస్తున్నట్టు చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ చైర్మన్‌ పోడి­యం ముందుకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. 

అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారా­యణ నిలదీశారు. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్క­రించాక దానిపై చర్చకు వీలు కాదంటూ శాసనమండలి చైర్మన్‌ మోషన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించడంతో చైర్మన్‌ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యు­లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీ­నామా చేయాలి..’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ సభ్యల ఆందోళన మధ్యే ఐదు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనతో ఉదయం సభ ప్రారంభమైన 27 నిమిషాలకే పదిన్నర గంటల సమయంలో వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పునఃప్రారంభమైన వెంటనే తిరిగి బుధవారానికి వాయిదా పడింది. 

రైతులపై ప్రేమ అసెంబ్లీలో ఏమైంది?: బొత్స
మరోవైపు.. మండలిలో ప్రతిపక్ష నేత బొత్య సత్యనా­రాయణ, మంత్రి పయ్యావుల కేశవ్‌ మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ‘మెగా డీఎస్సీపై, దాంట్లో జరిగిన అవక­తవకలపై చర్చ జరగాలని, విచారణ జరపాలని రెండు రోజులుగా డిమాండ్‌ చేస్తున్నాం. చర్చకు రెడీ అంటూ అన్ని చోట్లా  మాట్లాడుతున్నారు. మరి శాసన మండలిలో మేం అడుగుతున్నాం కదా..? సమాధానం చెప్పండి..’ అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. దీనిపై మంత్రి కేశవ్‌ స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్‌సీపీకి ప్రజల అజెండా పట్టదని ఆరోపించారు. దీనికి బొత్స తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసెంబ్లీలో ముందుగా డీఎస్సీపై చర్చించాకే  కరువుపై చర్చించారు కదా? మరి రైతులపై ఈ ప్రేమ అక్కడ ఏమైంది? ఇక్కడే వచ్చిందా?’ అంటూ నిలదీశారు. 

వ్యవసాయం– కరువుపై చర్చించాలని అడిగింది కూడా వైఎస్సార్‌సీపీనే అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎప్పుడూ లేని వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరగాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వ్యవసాయం – కరువు పరిస్థితులపై చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించవచ్చు కదా?’ అని బొత్స ప్రశ్నించారు. సమావేశాలను పొడిగించండి.. రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిద్దామ­ంటూ డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో చైర్మన్‌ జోక్యం చేసుకుంటూ దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సూచించారు. బొత్స, మంత్రి పయ్యావుల సంవాదం కొనసాగుతున్న సమయంలో సభ ఉదయం పదిన్నర గంటల సమయంలో తాత్కాలికంగా వాయిదా పడింది.

డీఎస్సీ పేరెత్తితే ప్రభుత్వం పారిపోతోంది
మండలిలో విపక్ష నేత బొత్స ధ్వజం
⇒ మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలి 
⇒ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి 
⇒ డీఎస్సీ అక్రమాలపై మండలిలో పూర్తిస్థాయిలో చర్చించాల్సిందే 
⇒ అప్పటిదాకా వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ పట్టుబడితే ప్రభుత్వం రెండో రోజు కూడా భయపడి పారిపోయిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కా­రు దాటవేత ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని పత్రికల్లో గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభు­త్వానికి లేదని మండిపడ్డారు.

డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్‌ కోటా కింద నేరుగా ఉద్యో­గాలు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 3 శాతం ఉద్యోగాలిస్తూ ఇచి్చన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్‌లో గానీ అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి చర్యలతో స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. 

తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు..! 
మెగా డీఎస్సీలో పేపర్‌ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. టీచర్‌ ఉద్యోగాల కోసం సెల్‌ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. ప్రభుత్వం  శాసనసభలో ఏవో మాటలు చెప్పడం మినహా మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ 1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు దానిపై సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ డీఎస్సీపై మాట్లాడారు. ఎలాంటి తప్పు జరగకపోతే విచారణకు సిద్ధమని ఎందుకు అనడం లేదు? డీఎస్సీలో తప్పులు జరిగినట్లు అసెంబ్లీలోనే నారా లోకేశ్‌ ఇన్‌ డైరెక్ట్‌గా ఒప్పుకున్నారు. డీఎస్సీ మార్కులు తాము కన్సిడర్‌లోకి తీసుకోవడం లేదని లోకేశ్‌ ప్రకటించారు. పీవీ సింధుకు ఉద్యోగం విషయంలో లోకేష్‌ చెప్పింది తప్పు. ఆమె అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె ఒక్కరికే ఉద్యోగం వచి్చంది. మీకు లాగా అందరికీ ఒకే మాదిరిగా ఇవ్వలేదు. వోక్స్‌ వ్యాగన్‌ కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్‌ నా శాఖ మార్చి సీబీఐ విచారణ చేయించారు’ అని బొత్స పేర్కొన్నారు.

రైతు సమస్యలపై చిత్తశుద్ధి కరువు
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ‘రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని కోరిందే మేం. ఈ రోజు సభకు వ్యవసాయ మంత్రి రాలేదు. కానీ దీనిపై చర్చ మాత్రం చేస్తామంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కరువు తాండవిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చారు.. ఎల్‌నినో వచ్చింది’ అని బొత్స వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement