శాసనసభలో ఎమ్మెల్యేల ఆందోళన
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో మంగళవారం విశాఖపట్నంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సమయాల్లో విశాఖలో కాలుష్యం ఢిల్లీని మించిపోతోందని ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్ ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పయత్నిస్తున్నామన్నారు.
కాఫీ తోటలు దెబ్బతిన్న విషయం తెలియదు..
కాఫీ బెర్రీ డిసీజ్ కారణంగా అరకులో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో కాఫీ తోటలు దెబ్బతిన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. దేవాలయాల్లో అర్చకులు, వేదపండితులు, పరిచారకుల నియామకాల్లో జోనల్ విధానం అమలులో లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2లో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
వడ్డీలేని రుణాలపై సమాధానం దాటవేత
వడ్డీలేని రుణాల పరిమితి గురించి అడిగితే, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం దాటవేశారు. 2014–15 మధ్య ఉన్నతి పథకంలో రూ.7.9 కోట్ల నిధుల దుర్వినియోగం అయినట్లు మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అంగీకరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ చట్టం 2026కు శాసనసభ ఆమోదం తెలిపింది.


